Keir Starmer: బ్రిటన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా!
Keir Starmer: బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర అస్థిరత నెలకొంది. లేబర్ పార్టీ అంతర్గత ఒత్తిడి, ఉపఎన్నికల్లో పేలవమైన ఫలితాల నేపథ్యంలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు.
Keir Starmer: బ్రిటన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా!
Keir Starmer: బ్రిటన్ (UK) రాజకీయాల్లో మరోసారి తీవ్ర అస్థిరత, సంక్షోభ వాతావరణం నెలకొంది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల భావోద్వేగంగా మాట్లాడిన ఆయన.. సొంత పార్టీ (లేబర్ పార్టీ) నుంచి వచ్చిన తీవ్ర రాజకీయ ఒత్తిడి వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. తాజా పరిణామంతో.. గడిచిన దశాబ్ద కాలంలో బ్రిటన్‌లో పదవి నుంచి మధ్యలోనే వైదొలిగిన ప్రధానుల సంఖ్య ఆరుకి చేరడం గమనార్హం.
2024 జూలైలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ, గత రెండేళ్లలో స్టార్మర్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. సుమారు వంద మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు, పలువురు కేబినెట్ మంత్రులు ఆయన నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అదే సమయంలో మేకర్‌ఫీల్డ్ (Makerfield) పార్లమెంటరీ ఉపఎన్నికలో స్టార్మర్ అంతర్గత ప్రత్యర్థి ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) ఘనవిజయం సాధించి వెస్ట్‌మినిస్టర్‌లోకి అడుగుపెట్టారు. దీంతో స్టార్మర్‌ను మార్చాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సన్నిహితుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాకు యూకే రాయబారిగా నియమించాలని స్టార్మర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తాను పదవిలో ఉన్నంత కాలం దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చానని, విలువలతో కూడిన పరిపాలన అందించానని స్టార్మర్ పేర్కొన్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియ జూలైలో ప్రారంభం కానుందని.. కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు (సెప్టెంబర్ వరకు) తాను కేర్‌టేకర్ (ఆపద్ధర్మ) ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రేసులో ఆండీ బర్న్‌హామ్ ముందంజలో ఉన్నారు.
కాగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేయబోతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బ్రిటన్‌లో వలసల నియంత్రణ, ఇంధన విధానాల నిర్వహణలో స్టార్మర్ సర్కార్ పూర్తిగా విఫలమవ్వడమే ఈ పతనానికి కారణమని ట్రంప్ విమర్శించారు.




