Pakistan : పాకిస్తాన్‌కు కోలుకోలేని షాక్.. 2000 మందిని దేశం నుంచి తరిమేసిన దుబాయ్ సర్కార్
Pakistan : గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం 2000 మంది పాకిస్తానీయులను బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టింది. ఈ చర్యతో పాకిస్తాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది.
Pakistan
Pakistan : గల్ఫ్ సంక్షోభం వేళ పాకిస్తాన్‌కు యూఏఈ గట్టి షాక్ ఇచ్చింది. దుబాయ్‌లో నివసిస్తున్న సుమారు 2000 మంది పాకిస్తానీయులను అక్కడి ప్రభుత్వం బలవంతంగా దేశం నుంచి తరిమేసింది. కేవలం తరిమేయడమే కాకుండా, వారి ఆస్తులను, సంపాదించుకున్న డబ్బులను, సామాగ్రిని కూడా యూఏఈ అధికారులు జప్తు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యూఏఈ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్తాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. గురువారం పాక్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఈ ముద్దపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీంతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విదేశాంగ కమిటీతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
ప్రముఖ పాకిస్తానీ పత్రిక డాన్ కథనం ప్రకారం.. గురువారం పార్లమెంట్ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు 2000 మంది పాకిస్తానీయుల బహిష్కరణ అంశాన్ని లేవనెత్తారు. గల్ఫ్ యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి యూఏఈ ప్రభుత్వం తమ పౌరులపై తీవ్రమైన అణచివేతకు పాల్పడిందని విపక్షాలు ఆరోపించాయి. వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టి, కట్టుబట్టలతో దేశం దాటించారని.. వారి కష్టార్జితాన్ని మొత్తం లాక్కున్నారని పార్లమెంట్‌లో గొడవకు దిగారు. విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ వివాదంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ పార్లమెంట్‌కు కొన్ని నమ్మలేని నిజాలను వెల్లడించింది. గత 5 ఏళ్లలో అరబ్ దేశాల నుంచి దాదాపు 1.64 లక్షల మంది పాకిస్తానీయులు బలవంతంగా వెనక్కి పంపబడ్డారు. ఇందులో సౌదీ అరేబియా నుంచి ఒక లక్ష మంది, యూఏఈ నుంచి 64 వేల మంది ఉన్నారు. అయితే ఇప్పుడు యూఏఈ నుంచి తరిమేసిన వారిలో ఎక్కువ మంది అక్కడ నేరాలకు పాల్పడినవారని, కొందరు టూరిస్ట్ వీసాలపై వెళ్లి భిక్షాటన చేస్తున్నందుకే డిపోర్ట్ చేశామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం యూఏఈలో ఇంకా 20 లక్షల మంది పాకిస్తానీయులు ఉపాధి పొందుతున్నారని వివరించింది.
మరోవైపు అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ వ్యవహారం వెనుక మరో కోణం ఉంది. యూఏఈలో పని చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన షియా ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అబుదాబి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, పాక్ షియా పౌరులు ఇతర దేశాలకు గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతోనే యూఏఈ వారిని వెనక్కి పంపుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. యూఏఈలో ఉన్న 20 లక్షల మంది పాకిస్తాన్ కార్మికులు ప్రతి ఏటా దాదాపు 8 బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్లకు పైగా) విదేశీ ద్రవ్యాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థకు ఇదే అతిపెద్ద ఆధారం. అయితే యూఏఈ ప్రభుత్వం ఇప్పుడు తమ దేశంలో పాకిస్తానీ కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోంది. ఒకప్పుడు ప్రాణస్నేహితుడిగా ఉన్న యూఏఈ.. ఇప్పుడు పాకిస్తాన్‌ను దూరం పెట్టడం గమనార్హం.
పాకిస్తాన్‌పై యూఏఈ ఆగ్రహానికి గల 2 ముఖ్య కారణాలు ఇవే!
ఇరాన్, గల్ఫ్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలే యూఏఈ ఆగ్రహానికి కారణమయ్యాయి.
* సౌదీకి సైనిక మద్దతు: యుద్ధం సమయంలో పాకిస్తాన్ కేవలం సౌదీ అరేబియాకు మాత్రమే తన సైనిక సహాయాన్ని ప్రకటించింది. పొరుగునే ఉన్న యూఏఈ భద్రతను పూర్తిగా పట్టించుకోలేదు.
* యూఏఈని కాదని మధ్యవర్తిత్వం: గల్ఫ్ దేశాల మధ్య శాంతి చర్చలు జరపడానికి పాకిస్తాన్ స్వయంగా ప్రయత్నించింది. అయితే ఈ విషయంలో యూఏఈని కనీసం సంప్రదించకపోవడం అబుదాబి పాలకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఈ కోపంతోనే యూఏఈ తామిచ్చిన అప్పును వెంటనే తిరిగి చెల్లించాలని పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. చివరికి పాక్ ప్రభుత్వం మళ్లీ సౌదీ అరేబియా సహాయంతో యూఏఈ అప్పును తీర్చాల్సి వచ్చింది.




