Israel-Iran Conflict: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంపై యూఏఈ కఠిన చర్యలు.. 19 మంది భారతీయుల అరెస్ట్
Israel-Iran Conflict: యుద్ధ ఉద్రిక్తతల మధ్య నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్న పరిస్థితిపై యూఏఈ కఠినంగా స్పందించి 19 మంది భారతీయులు సహా 35 మందిని అరెస్ట్ చేసింది
Israel-Iran Conflict
Israel-Iran Conflict: పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కఠిన చర్యలు చేపట్టింది. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం, రూమర్లను వ్యాప్తి చేశారనే ఆరోపణలతో 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ఏర్పడుతున్న గందరగోళాన్ని నివారించేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై నిరంతర నిఘా ఉంచిన తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అనేక గాసిప్స్ షికారు చేస్తున్నాయి. దీంతో యూఏఈ వంటి దేశాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం డిజిటల్ పర్యవేక్షణను ముమ్మరం చేసింది. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు పెట్టడం వల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని అధికారులు గుర్తించారు.
నేను బతికే ఉన్నాను..నెతన్యాహు
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ రూమర్లకు అడ్డుకట్ట వేసేందుకు నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను విడుదల చేశారు. జెరూసలేంలోని ఒక రెస్టారెంట్‌లో ఆయన కాఫీ తాగుతూ సరదాగా గడుపుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆయన తన చేతి వేళ్లను చూపిస్తూ, "నువ్వు నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నావా?" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నిజానికి, అంతకుముందు వచ్చిన ఒక వీడియోలో ఆయనకు ఆరు వేళ్లు ఉన్నాయని, అది ఏఐ (AI) సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అని కొందరు వాదించారు. నెతన్యాహు మరణించారని చెప్పేందుకే ఇటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోలను వాడుతున్నారని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.
ఆయన క్షేమంగా ఉన్నారు..ఇరాన్
ఇదే క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. ఫిబ్రవరి చివరలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారని బ్రిటీష్ మీడియా సంస్థ 'ది సన్' గతంలో ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మోజ్తాబా ఖమేనీ పూర్తిగా క్షేమంగా ఉన్నారని, ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మోజ్తాబా గాయపడ్డారంటూ వ్యాఖ్యలు చేయగా, ఇరాన్ ప్రతినిధి అరఘ్చి ఆ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల నేతలపై వస్తున్న ఇటువంటి వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న యూఏఈ ప్రభుత్వం, తన దేశంలో నివసిస్తున్న విదేశీయులు - తమ పౌరులు సోషల్ మీడియా వార్తలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చట్టవిరుద్ధమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠినమైన జైలు శిక్ష, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. డిజిటల్ క్రమశిక్షణను పాటించడం ద్వారానే ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోగలమని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.




