Donald Trump : మంగళవారం రాత్రి 8 గంటలకు ముహూర్తం.. నరకం ఎలా ఉంటుందో చూపిస్తా : ట్రంప్

Donald Trump : హోర్ముజ్ స్ట్రెయిట్ తెరవకుంటే ఇరాన్‌పై దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు సమయం ఇస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలను నాశనం చేస్తానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

CR Reddy
Updated on: 6 April 2026 7:55 AM IST
Donald Trump
X

Donald Trump 

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న హోర్ముజ్ స్ట్రెయిట్ వివాదం ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్‌కు డెడ్‌లైన్ మీద డెడ్‌లైన్ విధిస్తూ టెన్షన్ పెంచేస్తున్నారు. తాజా హెచ్చరికలతో గల్ఫ్ రీజియన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భీకర పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్‌కు మరో హెచ్చరిక జారీ చేశారు. గతంలో సోమవారం వరకు ఉన్న గడువును ఇప్పుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకు పొడిగించారు. "మంగళవారం రాత్రి 8:00 గంటలకు! హోర్ముజ్ స్ట్రెయిట్ తెరవండి.. లేదంటే మీరు నరకంలో బతకాల్సి వస్తుంది" అంటూ ట్రంప్ అత్యంత కఠినమైన భాషలో పోస్ట్ చేశారు. ఒకవేళ ఇరాన్ మెడలు వంచకుంటే ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను అమెరికా క్షిపణులతో తుడిచిపెట్టేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

హోర్ముజ్ స్ట్రెయిట్ అంటే ఏంటి? ఎందుకింత రచ్చ?

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో ఐదో వంతు (20%) ఈ హోర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. గత ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ మార్గాన్ని వెంటనే తెరవాలని, లేదంటే 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేస్తానని ట్రంప్ మార్చి 21నే బెదిరించారు. కానీ తెరవెనుక చర్చలు జరుగుతున్నాయన్న సాకుతో ఇప్పటికి మూడుసార్లు తన దాడుల సమయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

చర్చలు విఫలం.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు

ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అవి కొలిక్కి రావడం లేదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. "ఒప్పందం కుదిరే అవకాశం ఉంది, కానీ వారు మొండిగా ఉంటే మాత్రం అక్కడ అన్నింటినీ పేల్చివేస్తాను" అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్‌ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడమే లక్ష్యంగా పవర్ గ్రిడ్లపై దాడులు చేస్తామని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నాయకులను పాగల్ అని సంబోధిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్యపరమైన దుమారాన్ని రేపుతున్నాయి.


నిప్పుతో చెలగాటం వద్దు

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను పాటిస్తున్నారని, దీనివల్ల మధ్యప్రాచ్యం మొత్తం నిప్పుల కొలిమిలా మారుతుందని ఆయన హెచ్చరించారు. "మీ అనాలోచిత చర్యలు అమెరికన్ కుటుంబాలకు నరకాన్ని చూపిస్తాయి. యుద్ధ నేరాల వల్ల మీరు ఏమీ సాధించలేరు" అని గాలిబాఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బదులిచ్చారు. అమెరికా గనుక దాడులకు దిగితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైన్యం కూడా సిద్ధమైంది.

CR Reddy

CR Reddy

Next Story