Tsutomu Yamaguchi Story: అణుబాంబు దాడి నుంచి రెండుసార్లు తప్పించుకున్న ఒకేఒక్కడు
యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై పడుతుంది.
Tsutomu Yamaguchi Story: అణుబాంబు దాడి నుంచి రెండుసార్లు తప్పించుకున్న ఒకేఒక్కడు
Tsutomu Yamaguchi Story: యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై పడుతుంది. ఇక అణుయుద్ధం వస్తే మాట్లాడుకోవడానికి కూడా ఎవరూ మిగలరు. అటువంటి అణుబాంబుల నుంచి రెండుసార్లు తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన అరుదైన వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు అధికారికంగా అణుబాంబులతో అట్టుడికిన దేశం జపాన్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా జపాన్‌కు చెందిన వ్యక్తి గురించే.
సుటోము యమగుచి
జపాన్‌కు చెందిన సుటోము యమగుచి అనే వ్యక్తి రెండుసార్లు అణుబాంబుల దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. 1945లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులను వేసింది. ఈ బాంబుదాడుల్లో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విపత్తు నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి సుటోము యమగుచి. 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమాలో మిత్సుబిషి కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న యమగుచి, తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఆకాశంలో ఒక విమానం కనిపించింది. కొన్ని క్షణాల్లోనే అమెరికా వదిలిన “లిటిల్ బాయ్” అణుబాంబు పేలింది. ఈ పేలుడు ప్రభావం ఆయన ఉన్న ప్రదేశానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో జరిగింది. భారీ శబ్దం, అగ్ని జ్వాలలు, వేడి కిరణాల వల్ల ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శరీరంపై కాలిన గాయాలయ్యాయి. వినికిడి శక్తిని కోల్పోయాడు. తాత్కాలికంగా చూపు సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక ఆసుపత్రితో చికిత్స పొందే సమయంలో ఎలాగైనా తన సొంత నగరం నాగసాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటిరోజే తీవ్రమైన నొప్పితో, ఒంటినిండా గాయాలతో నాగసాకి బయలుదేరాడు. ఈ అణుదాడిలో హిరోషిమాలో 80వేల మంది మరణించారు. హిరోషిమా స్మశానంలా మారిన దృశ్యం ఆయన కళ్లముందు నిలిచింది.
నాగసాకిలో రెండోసారి
ప్రాణాలతో బయటపడిన యమగుచి నాగసాకి చేరుకొని, అక్కడి నుంచి ఆగస్టు 9న ఆఫీసుకు వెళ్లి తన పై అధికారికి హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి వివరించాడు. కానీ, ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు. పైగా ఆయన అతిశయోక్తిగా కల్పించి చెబుతున్నాడని హేళన చేశారు. అదే సమయంలో నాగసాకిలో ఫ్యాట్‌బాయ్ పేరుతో మరో అణుబాంబును జారవిడిచింది అమెరికా. ఈ ఫ్యాట్‌బాయ్ అణుదాడి నుంచి కూడా యమగుచి తప్పించుకున్నాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. నాగసాకి పేలుడులో సుమారు 40 వేల మంది మరణించగా..నగరం మొత్తం మృతదేహాలతో నిండిపోయింది.
డబుల్ సర్వైవర్
ఇలా మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు అణుదాడి నుంచి తప్పించుకొన్న వ్యక్తిగా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అరుదైన వ్యక్తిగా గుర్తింపుపొందారు. అణువిధ్వంసం నుంచి బయటపడిన యమగుచి జీవితం దురదృష్టకరమైనదైనా... మరోవైపు అసాధారణ అదృష్టాన్ని కూడా చూపించింది. ఆయన జీవితాన్ని చదివితే యుద్ధాలు ఎంత భయంకరంగా ఉంటాయో స్పష్టంగా తెలుస్తుంది. 2010లో జపాన్ ప్రభుత్వం అధికారికంగా ఆయన్ను డబుల్ సర్వైవర్‌గా గుర్తించింది. యమగుచి జీవితం మనిషి సహనశక్తికి, విధి విచిత్రాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేని ఈ కథ, యుద్ధం వల్ల కలిగే విధ్వంసాన్ని మళ్లీ మళ్లీ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.




