Hormuz Strait : హోర్ముజ్ జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌కు కొత్త తలనొప్పి
Hormuz Strait : హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.
Hormuz Strait
Hormuz Strait : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. హోర్ముజ్ ప్రాంతంలో నడిచే చమురు నౌకలపై గతంలో ప్రతిపాదించిన 20 శాతం రక్షణ రుసుము (రీఇంబర్స్మెంట్ ఫీజు) విధింపు నిర్ణయంపై ట్రంప్ యూ-టర్న్ తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ, మధ్యప్రాచ్య దేశాల నేతలతో జరిపిన చర్చల అనంతరం ఈ ఫీజు స్థానంలో సరికొత్త వ్యాపార, పెట్టుబడి ఒప్పందాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మాటలు మార్చినప్పటికీ, అంతిమంగా హోర్ముజ్ రక్షణ పేరుతో అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా ఎత్తుగడలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికాతో యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఈ ప్రాంతం నుంచి చమురు లేదా గ్యాస్ ఒక్క చుక్కను కూడా ఎగుమతి చేయనిచ్చేది లేదని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేయడంతో, ఆ మార్గంలో ప్రయాణించే ట్యాంకర్లు,కార్గో షిప్పుల సంఖ్య వేగంగా పడిపోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి బయలుదేరే చమురు నౌకలు సైతం ఇరాన్ మిస్సైల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి తమ రాడార్లు, ట్రాన్స్పాండర్లను నిలిపివేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగి, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి ఉంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా ప్రపంచ చమురు మార్కెట్ పై పట్టు సాధించాలని అమెరికా భావిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా తన స్వంత చమురు ఎగుమతులను రికార్డు స్థాయిలో పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అమెరికాలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న టెక్సాస్‌లోని పర్మియన్ బేసిన్, అలస్కాలోని నార్త్ స్లోప్ ప్రాంతాలపై ట్రంప్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం టెక్సాస్ నుంచి ప్రతిరోజూ 58 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుండగా, ఆధునిక హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ టెక్నాలజీ ద్వారా కొత్త బావుల తవ్వకాలను వేగవంతం చేశారు. 2027 నాటికి అమెరికా మొత్తం ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 142 లక్షల బ్యారెళ్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల రష్యా వంటి ప్రత్యర్థి దేశాల చమురు వ్యాపారానికి గండి కొట్టి, యూరప్, ఆసియా మార్కెట్లకు అమెరికా ప్రధాన సరఫరాదారుగా మారాలని చూస్తోంది.
మధ్యప్రాచ్య దేశాల చమురు సరఫరా కోసం అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఒక సరికొత్త ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇజ్రాయెల్‌ను ప్రపంచ చమురు సరఫరాకు ప్రధాన కేంద్రంగా మార్చాలనేది ఈ ప్లాన్. దీని ప్రకారం యూఏఈ, ఖతార్ దేశాల ఆయిల్ పైప్లైన్లను సౌదీ అరేబియాకు చెందిన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌తో అనుసంధానిస్తారు. అక్కడి నుంచి ఎర్ర సముద్ర ప్రవేశ ద్వారమైన యాన్బు పోర్ట్ ద్వారా చమురు నౌకలు బయలుదేరుతాయి. ఇవి సాంప్రదాయక సూయజ్ కాలువ ద్వారా కాకుండా, అకాబా గల్ఫ్ మీదుగా ఇజ్రాయెల్‌లోని ఈలాత్ పోర్టుకు చేరుకుంటాయి. అక్కడ ఉన్న ఈలాత్-అష్కెలోన్ పైప్‌లైన్ ద్వారా చమురు నేరుగా మధ్యధరా సముద్రానికి చేరుకుంటుంది. ఈ కొత్త రూట్ సూయజ్ కాలువ కంటే వేగవంతమైనది, చౌకైనది, అత్యంత సురక్షితమైనదని అమెరికా భావిస్తోంది.
మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేయడమే కాకుండా, ఎర్ర సముద్రం ప్రవేశ మార్గంలో కూడా ఇరాన్ ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ రెబల్స్ చమురు నౌకలపై దాడులను ఉధృతం చేశారు. హూతీల ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రారంభంలో ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకునే నెపంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు క్రమంగా ప్రపంచ చమురు వ్యాపారంపై ఆధిపత్యం చలాయించే ఆర్థిక యుద్ధంగా మారిపోయింది. ఒకవైపు అమెరికాను ప్రపంచంలోనే అతిపెద్ద చమురు విక్రేతగా మార్చడం, మరోవైపు ఇజ్రాయెల్ ద్వారా చమురు సరఫరా వ్యవస్థను నియంత్రించడమే ట్రంప్ అసలైన మాస్టర్ ప్లాన్ అని స్పష్టమవుతోంది.




