US vs Iran : ట్రంప్ యూ-టర్న్.. ఇరాన్ గర్జన ముందు అగ్రరాజ్యం మోకరిల్లిందా ?
US vs Iran : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడనుందా? ట్రంప్ యూ-టర్న్ తీసుకుని ఇరాన్ కు శాంతి ఒప్పందం ప్రతిపాదించారా? ఆ 14 సూత్రాల ఫార్ములా ఏంటి?
US vs Iran
US vs Iran : అంతర్జాతీయ రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య గత 40 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు తన పంథాను మార్చుకుని శాంతి చర్చల దిశగా అడుగులు వేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి అమెరికా నిజంగానే ఇరాన్ షరతులకు తలొగ్గిందా? లేక ఇది ట్రంప్ మార్క్ సరికొత్త ఎత్తుగడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అమెరికా సరెండర్ మోడ్?
గత 40 రోజులుగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా తన అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్‌ను దెబ్బతీయాలని చూసినా, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిరంతరం యుద్ధవిరామ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ, హోర్ముజ్ జలసంధి నుంచి యూఏఈ వరకు బాంబుల వర్షం కురిపించింది. ఈ మొండితనం చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపుతున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన ప్రకారం.. అమెరికా ఇప్పుడు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, హోర్ముజ్ జలసంధిని సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుకుంటోంది.
ట్రంప్ మార్క్ యూ-టర్న్
డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితంలో యూ-టర్న్ లు కొత్తేమీ కాదు. మొదట ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో యుద్ధానికి సై అన్న ట్రంప్, ఇప్పుడు అది పూర్తయిందని, ఇక శాంతి కావాలని అంటున్నారు. అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సైనిక చర్యను కేవలం 48 గంటల్లోనే నిలిపివేయడం గమనార్హం. ఇరాన్ తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా వాడుకుని అమెరికా నౌకలపై దాడులు చేయడంతో, అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ మార్పును ఇరాన్ తన విజయంగా భావిస్తోంది.
14 సూత్రాల శాంతి ఫార్ములా
అమెరికా మీడియా సంస్థ అక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఒక ఒప్పంద పత్రంపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే 48 గంటల్లో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఈ 14 సూత్రాల ఫార్ములాలోని ముఖ్యాంశాలు ఇవే:
* శాంతి చర్చల కోసం 30 రోజుల సమయం కేటాయించడం.
* ఇరాన్ దాదాపు 12 ఏళ్ల పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలి.
* అమెరికా వద్ద ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేయడం.
* హోర్ముజ్ జలసంధిలో ఇరు దేశాలు నాకాబందీని తొలగించడం.
* జనీవా లేదా ఇస్లామాబాద్‌లలో అధికారిక చర్చలు నిర్వహించడం.
* అంతర్జాతీయ అణు సంస్థల (UN) తనిఖీలకు ఇరాన్ అంగీకరించాలి.
అమెరికా ప్రతిష్టకు దెబ్బ?
ఈ యుద్ధం వల్ల ఇరాన్‌లో అనుకున్న విధంగా అధికార మార్పిడి జరగలేదు, అటు అణు కార్యక్రమం ఆగలేదు, ఇటు క్షిపణి ప్రయోగాలు నిలవలేదు. పైగా హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు పెంచుకుంది. అమెరికా పదే పదే తన మాట మార్చుకోవడంతో అంతర్జాతీయ స్థాయిలో అగ్రరాజ్యం ప్రతిష్టకు దెబ్బ తగిలిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతున్నారని, ఇరానే చర్చలకు ఆరాటపడుతోందని చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
శాంతి దిశగా అడుగులు.. కానీ?
శాంతి ఒప్పందం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, చమురు సరఫరాకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే, ట్రంప్ గతంలో ఒప్పందాలను ఉల్లంఘించిన చరిత్ర ఉన్నందున, ఇరాన్ ఆయనను ఎంతవరకు నమ్ముతుందనేది ప్రశ్నార్థకమే. అటు ఇరాన్ కూడా అణు ఆయుధాలు తయారు చేయబోమని హామీ ఇస్తేనే ఈ చర్చలు సఫలమవుతాయి. ఏది ఏమైనా రాబోయే 48 గంటలు పశ్చిమ ఆసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.




