Trump: ట్రంప్‌తో సెల్ఫీ దిగితే... రూ. 73 లక్షలు
ట్రంప్‌తో సెల్ఫీ దిగాలంటే ఇప్పుడు సుమారు 73 లక్షలు చెల్లించాలి. అదేవిధంగా ఉపాధ్యక్షుడితో ఫొటో దిగాలంటే 23 లక్షలు చెల్లించాలి. ఎందుకు ఇంత ధరలు నిర్ణయించారో తెలుసుకుందాం.
Trump: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ప్రతి నిర్ణయం ఆర్థిక మూలాలతో ముడిపడి ఉంటుంది. వచ్చే మధ్యంతర ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం రిపబ్లికన్ పార్టీ ఓ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. టెక్సాస్‌లోని డల్లాస్ వేదికగా సెప్టెంబరు 9, 10 తేదీల్లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కన్వెన్షన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో అగ్రనేతలతో వ్యక్తిగతంగా సంభాషించేందుకు, ఫొటోలు దిగేందుకు విరాళాల రూపంలో భారీ ధరలను నిర్ణయించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఒక్క ఫొటోకు 73 లక్షలు
ఈ కన్వెన్షన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఒక ఫొటో దిగాలంటే దాతలు ఏకంగా 88,600 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 73 నుంచి 74 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ట్రంప్‌తో కలిసి ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడాలంటే ఒక్కో వ్యక్తికి 2,50,000 డాలర్లు అంటే సుమారు రూ. 2.10 కోట్ల ధరకు టికెట్ నిర్ణయించారు.
ఉపాధ్యక్షుడితో ఫొటోకు డిమాండ్
మరోవైపు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో భేటీ, ఫొటోల కోసం ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. ఆయనతో ఫొటో దిగడానికి 35,000 డాలర్లు అంటే దాదాపు రూ. 29 లక్షలు, రౌండ్ టేబుల్ చర్చలకు 75,000 డాలర్లు అంటే రూ. 62 లక్షల పైచిలుకు చెల్లించాలని 'వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం వెల్లడించింది. వీటికి తోడు ప్రజాప్రతినిధుల సభలోని సభ్యులు ఈ వేదికపైకి రావడానికి కూడా 25,000 డాలర్లు వసూలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది.
మధ్యంతరం కోసం భారీగా నిధులు
సాధారణంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముందు మాత్రమే ఇలాంటి జాతీయ సదస్సులు నిర్వహిస్తారు. అయితే మధ్యంతర ఎన్నికల కోసం ఇంత భారీ స్థాయిలో నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టడం అరుదైన విషయం. ఈ వ్యూహంపై విస్తృతమైన రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా క్లిష్టమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థులకు ఆర్థికంగా సహాయపడటానికే ఈ స్థాయి విరాళాలు సేకరిస్తున్నామని నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఆర్థిక విభాగాధిపతి, టెక్సాస్ ప్రతినిధి బెత్ వాన్ డ్యూన్ స్పష్టం చేశారు.
కన్వెన్షన్‌లో కార్పొరేట్ రంగానికి చెందిన వ్యాపారవేత్తల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం, అధిక ధరల ప్రాతిపదికన విఐపిలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ప్రతిపక్షాలు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఆరంభమయ్యే రోజునే ఈ కార్యక్రమం ప్రారంభం కావడం, చారిత్రాత్మక 9/11 తీవ్రవాద దాడుల 25వ వార్షికోత్సవానికి ఒక రోజు ముందే ముగియనుండటంపై కాలక్రమ ఆధారిత వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విమర్శలన్నింటినీ తోసిపుచ్చుతూ రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఈ కార్యక్రమం పట్ల ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ కన్వెన్షన్‌కు దాదాపు 30,000 మందికి పైగా ప్రతినిధులు, దాతలు హాజరవుతారని, ఇప్పటికే దీని నిర్వహణ కోసం 42 మిలియన్ డాలర్ల నిధులు సమకూరాయని వెల్లడించింది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకు ఈ నిధుల సేకరణ కీలకమని రిపబ్లికన్లు విశ్వసిస్తున్నారు.




