US-China: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు... చైనా ఎప్పటికీ అలా చేయదు
ఇరాన్‌కు చైనా ఆయుధాలు విక్రయించబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. షీ జిన్‌పింగ్ మాటలను నమ్ముతున్నట్టుగా పేర్కొన్నారు.
US-China: ఇరాన్‌తో యుద్ధ వాతావరణం పరాకాష్టకు చేరిన వేళ, టెహ్రాన్‌కు చైనా భుజాలపై ఉంచి ప్రయోగించే దాదాపు 400 విమాన నిరోధక క్షిపణులను సరఫరా చేసేందుకు సిద్ధమవుతోందన్న నివేదికలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో స్పందిస్తూ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలూ ఇవ్వబోనని తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని, ఒకవేళ ఆ నివేదికలు నిజమైతే తాను తీవ్రంగా నిరాశ చెందుతానని స్పష్టం చేశారు.
వ్యూహాత్మక విశ్లేషణ ...ట్రంప్‌కు సవాల్
అమెరికా-ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమైన వేళ, దెబ్బతిన్న తమ వైమానిక రక్షణ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించుకోవడానికి ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మూడో దేశానికి చెందిన మధ్యవర్తిత్వ సంస్థ ద్వారా దాదాపు 400 అధునాతన క్షిపణులను అందుకోవడానికి ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లను సులువుగా కూల్చివేసే ఈ ఆయుధాలు క్షేత్రస్థాయిలో అమెరికా దళాల వైమానిక ఆధిక్యతకు పెద్ద సవాలుగా మారే అవకాశముంది. అయితే ఈ వ్యవహారంలో ట్రంప్ అనుసరిస్తున్న దౌత్య వ్యూహం ఆసక్తికరంగా ఉంది. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇరాన్‌కు ప్రత్యక్షంగా సైనిక సహాయం అందించబోమని తమకు వ్యక్తిగతంగా మాట ఇచ్చారని ట్రంప్ గుర్తుచేశారు. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ... పెద్ద దేశాలేవీ ఇరాన్ తరఫున ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడం లేదని, ఒకవేళ దిగితే అది ఆ దేశాలకే తీవ్ర నష్టం కలిగిస్తుందని ట్రంప్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
నాయకుల హామీల వెనుక దౌత్య సమీకరణాలు
గత మే నెలలో బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీని ట్రంప్ ప్రస్తావిస్తూ "మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. రష్యా సైతం ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ, అమెరికా ఆయుధ నిబంధనలను అర్థం చేసుకుందని ట్రంప్ వివరించారు. తాను ఉక్రెయిన్‌కు నేరుగా కాకుండా కేవలం నాటో దేశాలకే పూర్తి ధరకు ఆయుధాలు విక్రయిస్తున్నానని, ఆ తర్వాత అవి ఎలా పంపిణీ అవుతాయో అది వారి నిర్ణయమని వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి, ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు, నిఘా సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, బహిరంగంగా చైనా, రష్యాలను ప్రత్యక్ష శత్రువులుగా మార్చుకోకుండా దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచడానికే ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నారు. చైనా నుంచి ఈ 400 క్షిపణులు ఇరాన్ సైన్యానికి చేరితే మాత్రం, ఈ ప్రాంతంలో యుద్ధ జ్వాలలు మరిన్ని పెద్ద దేశాలకు విస్తరించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ చైనా యుద్ధంలోకి దిగితే... యుద్ధప్రభావం, యుద్ధ పరిమాణం మారిపోతుంది.




