USA Iran War : యుద్ధం ముగింపుపై ఇరాన్ కొత్త ప్లాన్.. ట్రంప్ రియాక్షన్ ఏంటి?

USA Iran War : యుద్ధం ముగింపుపై ఇరాన్ పంపిన 14 సూత్రాల ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా-ఇరాన్ మధ్య పోరు తీవ్రతరమైంది.

CR Reddy
Published on: 3 May 2026 10:20 AM IST
Donald Trump
X

Donald Trump

USA Iran War : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించే హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య మైండ్ గేమ్ మొదలైంది. యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నా, మరోవైపు ఆంక్షలు, నావికా దళాల మోహరింపుతో గల్ఫ్ తీరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను అమెరికా ముందుకు తెచ్చింది. పాకిస్థాన్ ద్వారా అందిన ఈ 14 సూత్రాల ప్రణాళికలో హోర్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్‌పై ఉన్న నావికాదళ ఆంక్షలను ఎత్తివేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, "ఇరాన్ పంపిన ప్రణాళికను నేను త్వరలోనే సమీక్షిస్తాను. అయితే గత 47 ఏళ్లుగా ప్రపంచానికి వారు చేసిన దానికి వారు ఇంకా తగిన మూల్యం చెల్లించలేదు, అందుకే ఈ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కావని నా అభిప్రాయం" అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం మూడు వారాల కాల్పుల విరమణ కొనసాగుతున్నా, శాంతి వైపు అడుగులు మాత్రం పడటం లేదు.

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ మాస్టర్ ప్లాన్

ప్రపంచ చమురు, గ్యాస్ వ్యాపారంలో 20 శాతం వాటా హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ మార్గంలో నౌకలపై దాడులు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తోంది. దీనిని అడ్డుకోవడానికి ట్రంప్ ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ఇరాన్ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ వసూలు చేస్తున్న సుంకాలు చెల్లించవద్దని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఒకవేళ ఇరాన్‌కు డిజిటల్ కరెన్సీ లేదా ఇతర రూపాల్లో నగదు చెల్లిస్తే ఆ కంపెనీలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదీ పరిస్థితి విషమం

ఇరాన్ జైలులో ఉన్న నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గిస్ మొహమ్మదీ ఆరోగ్యం క్షిణించడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. గుండెపోటుతో స్పృహ కోల్పోయిన ఆమెను జంజన్ లోని ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను టెహ్రాన్ తరలించాలని కుటుంబం కోరుతున్నా, ఇరాన్ నిఘా సంస్థలు అడ్డుకుంటున్నాయని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. జైలులో జరిగిన హింస వల్లే ఆమె పరిస్థితి ఇలా తయారైందని మానవ హక్కుల సంఘాలు ఇరాన్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్షలు

ఇదే సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను ఉరితీసింది. యాఘూబ్ కరీంపూర్ మరియు నాసిర్ బేకర్జాదే అనే వ్యక్తులు ఇరాన్ అణు కేంద్రాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇజ్రాయెల్ కు చేరవేస్తున్నారని కోర్టు నిర్ధారించింది. గత కొద్ది వారాల్లోనే ఇరాన్ ఇలాంటి పదుల సంఖ్యలో మరణశిక్షలను అమలు చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇరాన్ తన పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంటే, అమెరికా తన ఆంక్షలతో ఆ దేశాన్ని ఊపిరాడకుండా చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story