Trump AI Military Expansion: రక్షణ రంగంపై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్‌... భద్రత కాదు...ఏఐ ఆయుధాలే ముఖ్యం

అమెరికా సైన్యంలో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని వేగవంతం చేయాలని ట్రంప్ ఆదేశించారు. భద్రతా నియంత్రణలు, స్వయంచాలక ఆయుధాలు, ఏఐ యుద్ధ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

Balachander
Published on: 6 Jun 2026 12:10 PM IST
Trump AI Military Expansion: రక్షణ రంగంపై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్‌... భద్రత కాదు...ఏఐ ఆయుధాలే ముఖ్యం
X

Trump AI Military Expansion: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఇప్పుడు అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ రంగంలోకి కూడా ఏఐ కీలక పాత్ర పోషించేందుకు సిద్దమైంది. ఇప్పటికే కృత్రిమమేధతో పలురకాలైన ఆయుధాలను తయారు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు అమెరికా రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి, అదే సమయంలో తీవ్రమైన ఒత్తిడికి తెరలేపుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రత, సైనిక వ్యూహాల్లో ఏఐ సాంకేతికతను మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరించాలని మిలిటరీ వర్గాలకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథ, తెరవెనుక జరిగిన ఒక రహస్య ఆపరేషన్ వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

ట్రంప్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి?

సాధారణంగా యుద్ధ నిర్ణయాల్లో, ముఖ్యంగా ఒకరిపై దాడి చేయాలా వద్దా అనే విషయంలో సైనిక కమాండర్ల నిర్ణయమే తుది నిర్ణయం కావాలనేది ఇప్పటివరకు ఉన్న నియమం. కానీ, ట్రంప్ పంపిన తాజా మెమో ప్రకారం.. మారుతున్న కాలానికి అనుగుణంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ ఆయుధాల వినియోగాన్ని వేగవంతం చేయాలి. అయితే, ఈ ఏఐ టెక్నాలజీ దేశ చట్టాలకు, పౌర హక్కులకు లోబడి ఉండాలని, అమెరికా ప్రజలపై నిఘా పెట్టడానికి గానీ, భావప్రకటన స్వేచ్ఛను హరించడానికి గానీ దీనిని వాడకూడదని ట్రంప్ నిబంధన విధించారు. ఆయుధాల వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఏఐ సహాకారం అందిస్తే దాని వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది చూడాలి. నిబంధనలకు లోబడి ఆయుధాల వినియోగం జరుగుతుందా అన్నది కూడా ఉదయిస్తున్న ప్రశ్న.

వెనిజులా ఆపరేషన్‌లో ‘క్లాడ్’ మాయాజాలం

మిలిటరీలో ఏఐ వాడకం అనేది కేవలం పేపర్లకే పరిమితం కాలేదు, ఆల్రెడీ రంగంలోకి దిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం నడిపిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో ‘ఆంత్రోపిక్’ కంపెనీకి చెందిన ‘క్లాడ్’ అనే ఏఐ మోడల్‌ను ఉపయోగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. ఒక రహస్య మిలిటరీ ఆపరేషన్‌లో ఈ స్థాయి అధునాతన ఏఐని వాడటం ఇదే మొదటిసారి. ‘పాలంటిర్ టెక్నాలజీస్’ అనే డేటా సంస్థ భాగస్వామ్యంతో పెంటగాన్ ఈ క్లాడ్ ఏఐని క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లలో ఉపయోగించింది. శత్రువుల సమాచారాన్ని విశ్లేషించడం, కమ్యూనికేషన్లను పసిగట్టడం, వ్యూహాలు రచించడంలో ఈ ఏఐ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

పెరుగుతున్న ఆందోళనలు... కంప్యూటర్లు ప్రాణాలు తీస్తాయా?

ఇరాక్, సిరియాలో దాడుల కోసం, అలాగే గాజాలో లక్ష్యాలను గుర్తించడం కోసం ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఏఐ ఆధారిత డ్రోన్లను భారీగా వాడుతున్నాయి. దీనివల్ల శత్రువులను వేగంగా గుర్తించవచ్చని సైన్యం చెబుతున్నప్పటికీ, రక్షణ నిపుణులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు చేసే చిన్న తప్పుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. "లక్ష్యం ఎక్కడైతే ఉందో, అక్కడే దాడి జరిగేలా చూసే బాధ్యత మనుషుల చేతుల్లోనే ఉండాలి, ఏఐపై పూర్తిగా ఆధారపడలేం" అని స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ హెడ్ అడ్మిరల్ ఫ్రాంక్ బ్రాడ్లీ పేర్కొన్నారు.

బిగ్ టెక్ కంపెనీలతో పెంటగాన్ జత

ఈ ఏఐ రేసులో వెనకబడకూడదని భావిస్తున్న పెంటగాన్.. ఈ ఏడాది జనవరిలోనే ఎలాన్ మాస్క్‌కు చెందిన xAI సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ వంటి అగ్రశ్రేణి ఏఐ వ్యవస్థల కస్టమ్ వెర్షన్లను కూడా అమెరికా రక్షణ శాఖ తన పరిశోధనల కోసం వాడుతోంది. సాంకేతికత ఎంత పెరిగినా.. యుద్ధ భూమిలో ప్రాణాలు తీసే తుది నిర్ణయం మిషన్ల చేతుల్లోకి వెళ్తే అది మానవాళికే ముప్పుగా మారుతుందనే ఆందోళన మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ముప్పు లేకుండా, సాధారణ మనుషులకు ప్రాణాపాయం లేకుండా ఏఐ ఎంతవరకు ఈ రంగంలో విజయం సాధిస్తుందో చూడాలి. ఇటీవల చైనాలో ఓ రోబో చేసిన విన్యాసాలతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి ఎవరిని బాధ్యుడిగా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోబోలను ఆడించే ప్రోగ్రామ్‌లను మరింత అధునాతనంగా వినియోగిస్తే పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story