Trump: దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్... కిమ్‌తో దోస్తీకి సిద్దం
దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేపట్ట వలసిన నమయంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో నార్త్ కొరియాతో విబేధాలు తెచ్చుకోకూడదని సైనిక విన్యాసాలకు నిధులు తగ్గించేశారు.
Trump: పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దౌత్య వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న "మంచి సంబంధాల" ఆధారంగా దక్షిణ కొరియాతో నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటన దౌత్య వర్గాల్లో పెద్ద కలకలం రేపింది. దక్షిణ కొరియాతో విన్యాసాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవని, అవి కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియాకు తప్పుడు, శత్రుత్వ సంకేతాలను పంపుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
విన్యాసాల కోతకు ట్రంప్ చెప్పిన ప్రధాన కారణాలు
ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌కు ఈ విన్యాసాలను గణనీయంగా కుదించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అమెరికా ఏళ్ల తరబడిగా ఈ ఉమ్మడి సైనిక విన్యాసాల కోసం అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పదవీకాలంలో ఉత్తర కొరియా ఎప్పుడూ అమెరికాకు ముప్పుగా మారలేదని, గౌరవంగా ఉండిందని ట్రంప్ పేర్కొన్నారు. విన్యాసాల రద్దుకు సమయం మించిపోవడంతో వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఇరాన్ అణు నిరోధక చర్యల్లో తమతో కలిసి రావాలని ఇటీవల దక్షిణ కొరియాను కోరగా, వారు "నో థాంక్స్" అని తిరస్కరించారని, ఇది కూడా విన్యాసాల తగ్గింపు నిర్ణయానికి ఒక రకంగా కారణమేనని వ్యాఖ్యానించారు. ఒక రోజు ముందే కిమ్ జోంగ్ ఉన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, వారిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలను ట్రంప్ గుర్తుచేసుకోవడం గమనార్హం.
ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ...సీయోల్ స్పందన
ఆగస్టు 17 నుండి 27 వరకు పది రోజుల పాటు జరగాల్సిన ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాల్లో దాదాపు 18,000 మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొనాల్సి ఉంది. డ్రోన్ దాడులు, సైబర్ దాడులు, జిపిఎస్ సిగ్నల్స్ నిరోధకం వంటి ఆధునిక రక్షణ వ్యూహాలపై శిక్షణ పొందేందుకు ఇరుదేశాల మిలిటరీ నాయకత్వం గత వారమే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై దక్షిణ కొరియా సైనిక వర్గాలు స్పందిస్తూ, అమెరికాతో సైనిక విన్యాసాలు ముందస్తు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించాయి. ఇక ఇదిలా ఉంటే, మరోవైపు తమపై దాడి చేయడానికే ఈ సమర విన్యాసాలు చేస్తున్నారని, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఉత్తర కొరియా మండిపడింది. ఇరుదేశాల మధ్య దశాబ్ద కాలంగా ఉన్న సైనిక భాగస్వామ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం కొత్త అనిశ్చితికి దారితీసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన భద్రతా బాధ్యతల నుంచి వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు ఈ నిర్ణయంతో వ్యక్తమవుతున్నాయి.




