Trump China Visit: బీజింగ్‌లో సమావేశం కాబోతున్న ట్రంప్, జిన్‌పింగ్..ఏం జరగబోతోంది?

Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ల మధ్య సమావేశం జరగనుంది. తాను చైనా వెళుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు.

KVD Varma
Published on: 26 March 2026 11:46 AM IST
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ల మధ్య సమావేశం
X

Trump China Visit

Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తన ముఖ్యమైన సమావేశానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ట్రూత్”లో పంచుకున్న ఒక పోస్ట్‌లో, ఇరాన్‌లో అమెరికా సైనిక చర్య కారణంగా గతంలో వాయిదా పడిన తమ ఇద్దరి మధ్య సమావేశం ఇప్పుడు తిరిగి షెడ్యూల్ అయిందని ఆయన తెలిపారు. ఈ సమావేశం మే 14, 15 తేదీలలో బీజింగ్‌లో జరగనుంది.

ముఖ్యమైన..చారిత్రాత్మక సమావేశం..

ఈ పర్యటన అనంతరం, తాను,తన భార్య మెలానియా ట్రంప్, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లకు వాషింగ్టన్, డి.సి.లో స్వాగతం పలుకుతామని ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నదాని ప్రకారం ఈ చారిత్రాత్మక సమావేశాల కోసం ఏర్పాట్లను ఖరారు చేసేందుకు ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు.

రాబోయే సమావేశం చారిత్రాత్మకమైనది, ముఖ్యమైనది అని ఆయన అభివర్ణించారు, అలాగే అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమయం గడపడానికి తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రస్తుత అమెరికా-చైనా సంబంధాల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం అత్యంత ముఖ్యమైనదిగా పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకటించిన కరోలిన్ లెవిట్

అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 14, 15 తేదీలలో బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి ఈ సమావేశం మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు జరగాల్సి ఉండగా, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా వాయిదా పడింది.

ట్రంప్ చైనా పర్యటన అనంతరం, షీ జిన్‌పింగ్, ఆయన భార్య వాషింగ్టన్, డి.సి.ని సందర్శిస్తారని ప్రెస్ సెక్రటరీ తెలిపారు. అయితే, ఈ పర్యటన తేదీని తర్వాత నిర్ణయిస్తారు.

యుద్ధం త్వరలో ముగియవచ్చు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగియవచ్చని ట్రంప్ విశ్వసిస్తున్నారని ఈ కొత్త తేదీలు సూచిస్తున్నాయా అని అడిగినప్పుడు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ సానుకూల సంకేతం ఇచ్చారు. “మేము ఎల్లప్పుడూ నాలుగు నుండి ఆరు వారాలుగా అంచనా వేశాము. మీరే లెక్క వేసుకోవచ్చు,” అని ఆమె అన్నారు.

ట్రంప్ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ఇదిలా ఉండగా, అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని ఆ దేశ ప్రభుత్వ ఆధీనంలోని ప్రెస్ టీవీ కూడా పేర్కొంది. ఒక సీనియర్ రాజకీయ, భద్రతా అధికారిని ఉటంకిస్తూ ఆ టీవీ ఈ కథనం ఇచ్చింది. తమ షరతులు నెరవేర్చే వరకు టెహ్రాన్ యుద్ధాన్ని ముగించదని ఆ ఇరాన్ అధికారి అన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇస్లామాబాద్ (పాకిస్తాన్)కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను పంపారని ప్రచారం జారుతుతున్న విషయం తెలిసిందే.

వందలాది ఇరాన్ లక్ష్యాలపై దాడి..

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది. అమెరికా ఏకకాలంలో వందలాది ఇరాన్ లక్ష్యాలపై దాడి చేయగా, ఇరాన్ కూడా ఒక పెద్ద దాడితో ప్రతిస్పందించింది.

తాము ఒక అమెరికన్ ఎఫ్-18 యుద్ధ విమానాన్ని "విజయవంతంగా" కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. పర్షియన్ గల్ఫ్ సమీపంలో తమ వాయు రక్షణ వ్యవస్థలు ఒక అమెరికన్ ఎఫ్-18 యుద్ధ విమానాన్ని విజయవంతంగా కూల్చివేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా, సైనిక సోషల్ మీడియా ఛానెళ్లు పేర్కొన్నాయి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story