India Fuel Price Hike: ట్రంప్ స్టేట్‌మెంట్‌తోనే భారత్‌లో చమురు ధరలు పెరిగాయా? చైనా నిజంగానే ఆ పనిచేస్తుందా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ప్రపంచ రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చేస్తోంది. ఆయన ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి.
India Fuel Price Hike: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ప్రపంచ రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చేస్తోంది. ఆయన ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. దీని ప్రభావం నేరుగా భారత సామాన్యుడి జేబుపై పడింది. మే 15వ తేదీ ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఏకంగా మూడు రూపాయల వరకు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ ఏమని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రపంచంలో చమురు ధరలు ఆకాశాన్ని ఎందుకు తాకుతున్నాయి. తెలుసుకుందాం.
ట్రంప్ పర్యటన - చమురు ధరల లింక్ ఏంటి?
ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా నుంచి భారీ ఎత్తున క్రూడాయిల్‌ను కొనుగోలు చేసేందుకు చైనా ఆసక్తి చూపుతోందని, ఇందుకు సంబంధించి 'ఫెంటాస్టిక్ ట్రేడ్ డీల్స్' కుదిరాయని ఆయన పేర్కొన్నారు. చైనా తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం అమెరికాలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి బదులుగా అమెరికా చమురును చైనాకు సరఫరా చేయనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారు అయిన చైనా, అమెరికా వైపు మొగ్గు చూపడంతో గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 106.89 డాలర్లకి, డబ్ల్యూటీఐ ధర 102.27 డాలర్లకి చేరుకుంది.
హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు
ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి. ఈ మార్గం గుండా చమురు రవాణా చేసే నౌకలపై దాడులు జరుగుతాయనే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణించే పలు నౌకలపై దాడులు జరిగాయి. అంతేకాదు, ఇరాన్ నుంచి సరఫరా తగ్గే అవకాశం ఉండటం, మరోవైపు అమెరికా-చైనాల మధ్య కొత్త ఒప్పందాలు కుదరడం చమురు సరఫరా గొలుసును దెబ్బతీసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచం “ఎనర్జీ వార్” దశలోకి ప్రవేశిస్తోంది. యుద్ధం కంటే మార్కెట్ ఒత్తిడులే ఇప్పుడు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు చమురు సంస్థలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రించినప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిడి తట్టుకోలేక చివరకు సామాన్యుడిపై భారం వేశాయి.
చైనా ద్వంద్వ నీతి?
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. చైనాకు ఇరాన్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం ఉంది. ఇరాన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయుధాలు, టెక్నాలజీ ఇచ్చి ఆదుకున్న చైనా, ఇప్పుడు తన స్వలాభం కోసం అమెరికా వైపు వెళ్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికా చమురు ధర ఇరాన్, రష్యా ధరల కంటే ఎక్కువ. అయినప్పటికీ చైనా అమెరికాతో డీల్ కుదుర్చుకుంటే, అది ఇరాన్‌కు వెన్నుపోటు పొడిచినట్టే అవుతుంది.
మొత్తంగా చూసుకుంటే, ట్రంప్ పర్యటన మధ్యప్రాచ్యంలో శాంతి కోసం కాకుండా, కేవలం తన దేశ వ్యాపార ప్రయోజనాల కోసమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ 'సెకండ్ ఫేజ్' ధరల పెరుగుదల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు గడ్డుకాలమేనని చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ అంతర్జాతీయ రాజకీయ మంటలు ఇంకా ఎంతటి ఆర్థిక నష్టాన్ని మిగులుస్తాయో చూడాలి. ఈ సెంకడ్ ఫేజ్ కొంతకాలం కొనసాగితే మనిషి మరిన్ని ఇబ్బందులు ఎదర్కొనే అవకాశం ఉంది. ఈ ఫేజ్ దాటితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడమే కాకుండా, జీవనం మరింత భారతమౌతుంది.




