Donald Trump : ట్రంప్ సంచలన నిర్ణయం.. హోర్ముజ్ జలసంధి దిగ్బంధం.. ఇరాన్ ముఖద్వారం వద్ద అమెరికా యుద్ధనౌకలు

Donald Trump : ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం దిగ్బంధం విధించింది. హోర్ముజ్ జలసంధి క్లోజ్ చేసింది.. ఏప్రిల్ 13 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

CR Reddy
Published on: 13 April 2026 6:52 AM IST
Hormuz Strait
X

Hormuz Strait

Donald Trump : ప్రపంచ దేశాలను వణికించే మరో సంచలన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. ఇరాన్‌తో జరిపిన అణు చర్చలు విఫలం కావడంతో, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పై నాకాబందీ (దిగ్బంధం) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 13, సోమవారం ఉదయం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలను మరింత తీవ్రం చేస్తోంది.

అమెరికా, ఇరాన్ మధ్య అణు చర్చలు విఫలమైన కొన్ని గంటలకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికన్ సెంట్రల్ కమాండ్ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఇరాన్ ఓడరేవులకు వచ్చే, వెళ్లే అన్ని రకాల వాణిజ్య నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంటుంది. ఇది కేవలం ఇరాన్ నౌకలకే కాకుండా, ఆ దేశంతో వ్యాపారం చేసే అన్ని దేశాల నౌకలకూ వర్తిస్తుంది. అరేబియా సముద్రం, ఓమన్ గల్ఫ్ ప్రాంతాల్లోని ఇరాన్ తీర ప్రాంతాలను అమెరికా నౌకాదళం తన ఆధీనంలోకి తీసుకోనుంది.

హోర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ సన్నని సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఇప్పుడు ట్రంప్ దీనిపై దిగ్బంధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ కు టోల్ చెల్లించి వెళ్లే నౌకలను గుర్తించి, వాటిని అంతర్జాతీయ జలాల్లోనే నిలిపివేయాలని ట్రంప్ తన నౌకాదళాన్ని ఆదేశించారు. ఇరాన్ అక్రమంగా వసూలు చేస్తున్న టోల్ ను అరికట్టడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మద్దతు ఉన్న వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు ఇరాన్‌లో 3,000 మందికి పైగా, లెబనాన్‌లో 2,020 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తాజా దిగ్బంధం వల్ల పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. "మాకు డబ్బు కావాలి, అంతకంటే ముఖ్యంగా అణు ఆయుధాలు లేని ఇరాన్ కావాలి. లేదంటే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనకాడం" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‎లో హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల కోసం అమెరికా సైన్యం కొన్ని కీలక సూచనలు చేసింది. ఇరాన్ కాని ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించబోమని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అయితే, ఈ మార్గంలో ప్రయాణించే నావికులు నిరంతరం అలర్ట్ గా ఉండాలని, బ్రిడ్జ్-టు-బ్రిడ్జ్ ఛానల్ 16 ద్వారా అమెరికా నౌకాదళంతో టచ్ లో ఉండాలని సూచించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story