Bus Accident : ఈద్ సెలవులు ముగించుకుని వస్తుండగా విషాదం.. నదిలో పడిపోయిన బస్సు, 16 మంది మృతి

Bus Accident : బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో బస్సు పడిపోయి 16 మంది మృతి చెందారు. ఫెర్రీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని తారిక్ రెహమాన్ విచారణకు ఆదేశించారు.

CR Reddy
Published on: 26 March 2026 7:37 AM IST
Bus Accident
X

Bus Accident

Bus Accident : పండగ పూట బంగ్లాదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఈద్ సెలవులు ముగించుకుని సంతోషంగా ఇళ్లకు మళ్లుతున్న ప్రయాణికులను మృత్యువు కబళించింది. రాజ్ బారి జిల్లాలోని దౌలత్ దియా టెర్మినల్ వద్ద జరిగిన భయంకరమైన ప్రమాదంలో ఒక ప్రయాణికుల బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు, మహిళలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బుధవారం సాయంత్రం 5:15 గంటల సమయంలో దౌలత్ దియా టెర్మినల్ వద్ద నదిని దాటడం కోసం బస్సును ఫెర్రీ (పెద్ద పడవ) పైకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఒక చిన్న పడవ వచ్చి ఫెర్రీని బలంగా ఢీకొట్టింది. దీనివల్ల బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నేరుగా పద్మా నదిలోకి దూసుకెళ్లిపోయింది. క్షణాల్లో బస్సు నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సు బయట ఉన్న కొందరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా, లోపల ఉన్నవారు మాత్రం నీటిలోనే చిక్కుకుపోయారు. ఆరు గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్స్ చివరకు భారీ క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. బస్సు లోపలే 14 మృతదేహాలు కుప్పలుగా పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. అంతకుముందే గోతాఖోర్లు ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. ఇంకా పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు, వారి కోసం సైన్యం, పోలీసులు గాలిస్తున్నారు.

ఈ భయంకరమైన ప్రమాదంపై బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, వెంటనే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎక్కడా లోపం ఉండకూడదని, గల్లంతైన వారందరినీ వెలికితీయాలని స్పష్టం చేశారు. చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది.

బంగ్లాదేశ్‌లో ఫెర్రీ టెర్మినల్స్ వద్ద తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే ఆ సమయంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది.

CR Reddy

CR Reddy

Next Story