Times Square Shooting: అమెరికాలో మరో కాల్పుల కలకలం.. టైమ్స్ స్క్వేర్‌లో టెన్షన్.!
Times Square Shooting: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతం న్యూయార్క్ 'టైమ్స్ స్క్వేర్' (Times Square) లో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో..
times square shooting
Times Square Shooting: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతం న్యూయార్క్ 'టైమ్స్ స్క్వేర్' (Times Square) లో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో తీవ్ర కలకలం రేగింది. పదుల సంఖ్యలో గుళ్లు పేలడంతో అక్కడ ఉన్న వేలాది మంది పర్యాటకులు, స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రక్షణ కోసం సమీపంలోని షాపులు, మెట్రో స్టేషన్ల వైపు జనం దూసుకువెళ్లడంతో ఆ ప్రాంతమంతా కాసేపు తీవ్ర గందరగోళంగా మారింది.
విజేతల వేడుకల వేళ.. ఊహించని దారుణం
ఎన్‌బీఏ (NBA) ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న 'న్యూయార్క్ నిక్స్' (New York Knicks) జట్టు విజయోత్సవ వేడుకలు ముగిసిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగింది. ఈ సంబరాల కోసం మన్‌హట్టన్ ఏరియాకు భారీగా జనం తరలివచ్చారు. వేడుకలు ముగిసి అందరూ ఇళ్లకు తిరుగుముఖం పడుతున్న సమయంలో, రద్దీగా ఉన్న ఒక కూడలి (Intersection) వద్ద గుర్తుతెలియని సాయుధ దుండగులు అకస్మాత్తుగా తుపాకులతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారవుతున్న దృశ్యాలు అక్కడి నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి.
రంగంలోకి పోలీసులు.. ఒకరికి తీవ్ర గాయాలు
అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారులు కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోతున్న దుండగులను పట్టుకోవడానికి పోలీసులు వారిని వెంబడించారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు.. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కనీసం ఒక్కరిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో టైమ్స్ స్క్వేర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.




