Sudan Civil War: ఘోర విపత్తు అంచున సూడాన్‌... గాజాను మించిన సంక్షోభం

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోరమైన విపత్తు సంభవించింది. ప్రభుత్వ దళాలు, పారా మిలిటరీ దళాల మధ్య భీకరమైన పోరు జరుగుతున్నది. ఈ నేపధ్యంలో 1.1 కోట్లకుపైగా ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లిపోయారు.

Balachander
Published on: 27 Jun 2026 12:28 PM IST
Sudan Civil War: ఘోర విపత్తు అంచున సూడాన్‌... గాజాను మించిన సంక్షోభం
X

Sudan Civil War: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో గత ఏప్రిల్ 2023 నుండి అధికార సైన్యానికి, పారామిలిటరీ దళమైన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన దశకు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 1.1 కోట్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి రోడ్డున పడ్డారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా, ఆహార సంక్షోభంగా మారింది. పాలస్తీనాలోని గాజాలో జరుగుతున్న దాడుల కంటే కూడా సూడాన్‌లోని మారణహోమం అత్యంత దారుణంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సమాజం దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ రాజకీయ వ్యూహం దాగి ఉంది.

మరో నరమేధానికి సిద్ధమౌతున్న ‘ఎల్ ఒబెయిడ్’ నగరం

గతంలో 'ఎల్ ఫాషర్' నగరంలో ఆఫ్రికన్ నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని నిరంకుశంగా సాగించిన నరమేధం, లైంగిక దాడులు, బలవంతపు అదృశ్యాల వంటి మూడు ప్రధాన జాతి నిర్మూలన చర్యలను ఆర్ఎస్ఎఫ్ దళాలు ఇప్పుడు వ్యూహాత్మక నగరమైన ‘ఎల్ ఒబెయిడ్’ పై ప్రయోగించడానికి సిద్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల మంది పౌరులు చిక్కుకుపోయిన ఈ నగరాన్ని చుట్టుముట్టిన తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులు, ఆర్టిలరీ షెల్లింగ్‌లతో విరుచుకుపడుతున్నారు. ఏసీఎల్ఈడీ గణాంకాల ప్రకారం.. గత 11 నెలల్లోనే ఈ గ్రూప్ ఏకంగా 4,200 మందికి పైగా అమాయక పౌరులను బలితీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వేతర ముఠాలు జరిపిన హింసలో 11 శాతం మరణాలకు ఒక్క ఈ ఆర్ఎస్ఎఫ్ దళమే కారణం కావడం దీని భీకరతకు నిదర్శనం.

ప్రపంచం మౌనానికి కారణం.. యూఏఈ ‘డబ్బు - రాజకీయం’!

హ్యూమన్ రైట్స్ వాచ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెన్నెత్ రాత్ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించిన నిజాలు గ్లోబల్ లీడర్ల ద్వంద్వ నీతిని ఎండగట్టాయి. ఈ దారుణాలన్నింటి వెనుక సంపన్న దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎఫ్ దళాలకు అవసరమైన ఆధునిక ఆయుధాలను, కిరాయి సైనికులను సరఫరా చేస్తోంది యూఏఈ దేశమే. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నోరు మెదపడం లేదు. యూఏఈకి ఉన్న అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఇతర దేశాలతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. ఆఫ్రికా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే, యూఏఈతో ఉన్న ఆర్థిక సంబంధాల కోసం అగ్రరాజ్యాలు ఈ నరమేధాన్ని చూస్తూ ఊరుకుంటున్నాయి.

అమెరికా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో ఆయుధ సరఫరాను ఆపలేకపోతున్నాయి. ఒకప్పుడు జంజావీద్ అనే క్రూరమైన గిరిజన ముఠాగా ఉండి, నేడు డార్ఫర్ బంగారు గనులను నియంత్రిస్తూ అంతర్జాతీయ అండదండలతో ఎదుగుతున్న ఆర్ఎస్ఎఫ్ చీఫ్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో చర్యలు హిట్లర్ నాటి నరమేధాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం తన స్వార్థ లాభాలను పక్కనబెట్టి యూఏఈపై ఒత్తిడి తీసుకురాకపోతే, సూడాన్ ఆధునిక చరిత్రలోనే ఒక పెద్ద స్మశాన వాటికగా మారడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వలాభాలు, నరమేధాన్ని పక్కనపెట్టి ఆఫ్రికా అభివృద్ధికి తోడ్పడితే ఆసియా, యూరప్‌ దేశాల మాదిరిగానే ఆఫ్రికా ఖండం కూడా అభివృద్ధిపదంలో పయనిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story