Jail Violence : శ్రీలంక జైలులో రక్తపాతం.. ఖైదీల గ్రూపుల మధ్య ఘోర యుద్ధం, 25 మంది మృతి

Jail Violence : శ్రీలంకలోని నెగోంబో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘోర ఘర్షణ తీవ్ర హింసాత్మకంగా మారింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మంది తీవ్రంగా గాయపడ్డారు.

CR Reddy
Published on: 7 July 2026 6:50 AM IST
Jail Violence
X

Jail Violence 

Jail Violence : భారత పొరుగు దేశమైన శ్రీలంకలోని నెగోంబో జైలులో ఊహించని విధంగా భారీ ఎత్తున హింస చెలరేగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ ఘోర ఘర్షణలో ఆరుగురు జైలు సిబ్బందితో సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శిక్ష అనుభవిస్తున్న శాశ్వత ఖైదీలకు, విచారణ ఎదుర్కొంటున్న తాత్కాలిక ఖైదీల గ్రూపునకు మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ గొడవ మొదలైంది. ఇది కాస్తా ముదిరి జైలు చరిత్రలోనే అత్యంత దారుణమైన సాయుధ పోరాటంగా మారి రక్తపాతం సృష్టించింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు, ప్రత్యేక రక్షణ దళాలు, దేశ ఆర్మీ సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. దాదాపు 2,400 మంది ఖైదీలు ఉన్న నెగోంబో జైలులో ఆదివారం నాడే మొదటిసారి రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అయితే సోమవారం ఉదయం ఖైదీలకు టిఫిన్ వడ్డిస్తున్న సమయంలో ఈ గొడవ మళ్లీ పెద్దదైంది. ఇరు వర్గాలు కర్రలు, మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో జైలు సిబ్బంది గొడవను ఆపడానికి ప్రయత్నించగా, రెచ్చిపోయిన ఖైదీలు అధికారులపై కూడా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. జైలు సిబ్బందిని ప్రధాన గేటు వరకు తరిమికొట్టి, కొందరు ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఈ హింస వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉండి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఆదివారం జరిగిన మొదటి రౌండ్ గొడవల్లో ఇద్దరు ఖైదీలు చనిపోగా, 38 మంది గాయపడ్డారు. కానీ సోమవారం ఉదయం హింస తీవ్రరూపం దాల్చడంతో మరో 23 మంది చనిపోయారు. ఈ రెండో రోజు మరణించిన వారిలో ఆరుగురు జైలు అధికారులు కూడా ఉండటం అక్కడి భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. నెగోంబో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పుష్ప గమలత్ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రికి తీసుకొచ్చిన వారిలో చాలా మందికి బుల్లెట్ గాయాలు ఉన్నాయని, మరికొందరి శరీరాలపై మారణాయుధాలతో పొడిచిన లోతైన గాయాలు ఉన్నాయని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న 18 మందిని మెరుగైన చికిత్స కోసం మరో పెద్ద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి శ్రీలంక వాయుసేన రంగంలోకి దిగి హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా జైలు ఆవరణను గాల్లో నుంచి పర్యవేక్షించింది.

జైలులో ఇంత పెద్ద ఎత్తున హింస జరిగిందనే వార్త తెలియగానే ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో జైలు వెలుపలికి చేరుకున్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమై జైలు చుట్టూ బారికేడ్లు వేసి వారిని అడ్డుకున్నారు. శ్రీలంక న్యాయ, జాతీయ సమగ్రత శాఖ మంత్రి హర్షణ నానాయక్కార స్వయంగా జైలును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. ఖైదీల చేతుల్లోకి తుపాకులు, ఇతర ఆయుధాలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని, ప్రస్తుతం జైలు ప్రాంగణం పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా శ్రీలంకలో 2020లో జరిగిన జైలు హింసలో 11 మంది, 2012 లో కొలంబో జైలు దంగాల్లో 27 మంది చనిపోయారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story