Animal Rescue Operation: సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టిన స్పానిష్ ఆర్మీ... కార్చిచ్చు నుంచి వేలాది జంతువులను రక్షించిన అధికారులు
స్పెయిన్ కార్చిచ్చు నుంచి ఆర్మీ అధికారులు జంతువులను అత్యంత భద్రంగా రక్షించగలిగారు. దీనికోసం ప్రత్యేకమైన ఆపరేషన్‌ను చేపట్టింది.
Animal Rescue Operation: చుట్టూ ఉగ్రరూపం దాల్చిన మంటలు... 131 చదరపు మైళ్ల అడవి బూడిదైనా చెక్కుచెదరని మూగజీవాల ప్రాణాలు. ఏ ప్రాణినీ వదిలిపెట్టం... కార్చిచ్చులో స్పానిష్ సైన్యం, రెస్క్యూ టీమ్‌ల సాహసోపేతమైన ఆపరేషన్. మంటల తాకిడికి భయపడిన జంతువులు... కాపాడిన సివిల్ గార్డ్ దళాలు!
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ పశ్చిమ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన కార్చిచ్చు దాదాపు 131 చదరపు మైళ్లు అంటే సుమారు 340 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న అటవీ భూమిని, పొలాలను దహించివేసింది. ఎగసిపడే మంటలు, ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగను చూసి వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్పానిష్ సైనిక విభాగాలు, పార్కు నిర్వాహకులు, రెస్క్యూ సిబ్బంది కలిసి వేలాది మూగజీవాలను కాపాడేందుకు అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించారు.
మంటల ముట్టడిలో సాఫారీ మాడ్రిడ్ ... వేలాది జీవులను రక్షించిన అధికారులు
మాడ్రిడ్ నగర సమీపంలో ఉన్న ప్రసిద్ధ 'సాఫారీ మాడ్రిడ్' జూ పార్కుకు సమీపంలో మంటలు కేవలం 500 మీటర్ల దూరంలోకి వచ్చిన సమయంలో పార్కులోని దాదాపు 1,000 కి పైగా జంతువుల ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. అయితే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న సిబ్బంది అక్కడి నుంచి పారిపోకుండా... జంతువులను ఎయిర్ కండిషన్ ఉన్న సిమెంట్ భవనాల్లోకి తరలించారు. మంటలు దగ్గరికి వచ్చేకొలది...వాటిని దారి మళ్లించేందుకు పైపులతో నీళ్లు చల్లుతూ పొగను, మంటలను అదుపు చేసి జూను కాపాడుకున్నారు. అయితే, అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగులను రెండున్నర రోజులపాటు గదుల్లోనే బంధించే ఉంచడంతో యవ్వనంలో ఉన్న ఆసియా మగ ఏనుగులు ఆందోళనలకు గురయ్యాయి. కానీ, మరో మార్గం లేకపోవడంతో వాటిని సురక్షితంగా ఉంచేందుకు ఈ పని చేయవలసి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
సాహసోపేత ఆపరేషన్
బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న స్పానిష్ సివిల్ గార్డ్ బలగాలు ప్రత్యేక శ్రద్ధతో జంతువులను తరలించారు. ఏ చిన్న జంతువును కూడా వదిలివేయబోమని, జంతువులను సురక్షితంగా రక్షించేందుకే ఆపరేషన్ చేపట్టినట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక మాడ్రిడ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాన్ మార్టిన్ డి వాల్డెయిగ్లేసియాస్ ప్రాంతంలో ఉన్న ఒక బుల్‌రింగ్ ను తాత్కాలిక పునరావాస కేంద్రంగా మార్చారు. అక్కడకు గుర్రాలు, గాడిదలు, మేకలు, పెంపుడు కుక్కలు, పిల్లులను తరలించారు. అంతేకాకుండా కంగారూలు, ఒంటెలు, రాబందులు, మొసళ్లను సైతం సురక్షితంగా రక్షించారు.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల రక్షణ
సమీపంలో ఉన్న 'కూనా ఐబెరికా' అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి కేవలం 10 మీటర్ల సమీపంలోకి రావడంతో అక్కడ ఉన్న ఐబీరియన్ తోడేలు, యురేషియన్ లింక్స్ వంటి అరుదైన జంతువులకు మత్తుమందు ఇచ్చి, సాఫారీ మాడ్రిడ్‌కు, ఇతర విశ్వవిద్యాలయాల రక్షణ కేంద్రాలకు తరలించారు. రెండు రాత్రుల పాటు నిద్రలేకుండా కాపలా కాసి, మంటలు పూర్తిగా చల్లారే వరకు శ్రమించిన అధికారుల కృషి వల్ల ఒక్క జంతువు కూడా మృతి చెందకపోవడం ఒక గొప్ప విశేషం. ప్రస్తుతం వాతావరణం అదుపులోకి రావడంతో జంతువులన్నీ తిరిగి తమ సహజ ఆవాసాలకు చేరుకున్నాయి. అరుదైన జంతువులను రక్షించుకోవాలనే సంకల్పంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు స్పెయిన్ ప్రభుత్వం తెలియజేసింది.




