Spain Morocco Crisis: మొరాకో సరిహద్దుల్లో తీవ్ర సంక్షోభం...సెయుటాకు భారీగా స్పెయిన్ సైన్యం
మొరాకో నుండి ఒక్కసారిగా స్పెయిన్‌లోకి భారీ ఎత్తున వలసదారులు ప్రవేశించడంతో సెయుటా సరిహద్దుల్లో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.
Spain Morocco Crisis: ఆఫ్రికా ఖండంలో స్పెయిన్‌కు చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం 'సెయుటా' సరిహద్దు వద్ద అనూహ్య రీతిలో శరణార్థుల సంక్షోభం తలెత్తింది. పొరుగున ఉన్న మొరాకో దేశం నుండి వేలాది మంది వలసదారులు ఒకేసారి సరిహద్దులు దాటి స్పెయిన్ భూభాగంలోకి చొచ్చుకురావడంతో సరిహద్దు రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ తీవ్రమైన అత్యవసర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు స్పెయిన్ ప్రభుత్వం రంగంలోకి దిగి, సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించింది.
క్షణాల్లో మారిన పరిస్థితులు ... సరిహద్దుల వద్ద అస్తవ్యస్తం
గురువారం ఉదయం తారజల్ బీచ్ ప్రాంతంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చిన వలసదారులు సముద్ర తీరం వెంట ఉన్న కాపలా గోడలు దాటుకుంటూ, ఈదుకుంటూ స్పెయిన్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో కనీసం 9 మంది వలసదారులు నీటిలో మునిగి మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 2,000 నుండి 3,000 మందికి పైగా సరిహద్దు దాటినట్లు అంచనా వేస్తున్నారు. గత వారంలోనే 1,500 మందికి పైగా శరణార్థులు సరిహద్దులు దాటి రావడంతో పాటు తాజాగా వేలాది మంది స్పెయిన్‌లోకి ప్రవేశించడంతో స్థానిక రిసెప్షన్ సెంటర్లు పూర్తిగా నిండిపోయాయి. వందలాది మంది వలసదారులు నగర వీధుల్లోనే తెల్లవార్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ గార్డ్ అధికారులు దీనిని పూర్తి గందరగోళం అని అభివర్ణించడమే కాకుండా, రక్షణ సరిహద్దులు సంపూర్ణంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.
అత్యవసర చర్యల్లో స్పెయిన్ ప్రభుత్వం
పరిస్థితి చేయిదాటిపోవడంతో సెయుటా ప్రాంతీయ నేత ఖువాన్ జీసస్ వివాస్, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి సైన్యాన్ని పంపాలని కోరారు. దీనికి స్పందించిన స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, హోం మంత్రి ఫెర్నాండో గ్రాండే-మార్లాస్కాతో కలిసి స్వయంగా సెయుటా సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరోవైపు, అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి మొరాకోకు పంపించేందుకు, కొత్తగా ఎవరూ సరిహద్దు దాటకుండా అడ్డుకోవడానికి మొరాకో భద్రతా దళాలతో కలిసి స్పెయిన్ సమన్వయం చేసుకుంటోంది.
ఈ వలసలకు కారణమేంటి?
హఠాత్తుగా వచ్చిన వలసల వనుక నిర్దిష్ట కారణాలు వెల్లడికాకపోయినప్పటికీ, విశ్లేషకులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం... సముద్ర మార్గాన సరిహద్దుకు చేరుకునే వలసదారులను చట్టపరమైన విచారణ లేకుండా తక్షణమే వెనక్కి పంపకూడదని ఆదేశించింది. ఈ తీర్పు వలసదారులకు అనుకూలంగా మారి వలస ప్రవాహాన్ని పెంచి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మే 2021లో కూడా ఇలాగే రెండు రోజుల్లో 8,000 మందికి పైగా వలసదారులు సెయుటాలోకి రావడం వల్ల స్పెయిన్-మొరాకో మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆఫ్రికా ఖండం నుండి యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి సెయుటా, మెలిల్లా ప్రాంతాలు మాత్రమే ఏకైక భూ సరిహద్దులు. అందుకే ఐరోపాకు వెళ్లాలనుకునే వలసదారులకు ఇవి ప్రధాన ద్వారాలుగా మారాయి. ఒకవైపు మానవతా దృక్పథం, మరోవైపు సరిహద్దు భద్రత - ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు స్పెయిన్ ప్రభుత్వానికి తీవ్ర సవాలుగా మారింది. ఈ సమస్యను స్పెయిన్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మానవతా దృక్పదంతో వ్యవహరించి తన పెద్ద మనసును చాటుతుందా లేదంటే వెనక్కి పంపించి మొరాకోతో వివాదాలు పెంచుకుంటుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.




