Space War : భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ మహా యుద్ధానికి చైనా స్కెచ్
Space War : భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ మహా యుద్ధానికి చైనా స్కెచ్ వేస్తోంది. తన టాప్ సీక్రెట్ స్పేస్ ప్లేన్ 'షెన్లాంగ్' ద్వారా అంతరిక్షంలో విడిచిన ఒక రహస్య వస్తువు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణకిస్తోంది.
Space War
Space War : భవిష్యత్తులో రాబోయే మహా సంగ్రామానికి భూమి కాకుండా అంతరిక్షం వేదిక కాబోతోందా? శత్రుదేశాలపై దాడి చేసేందుకు చైనా ఆకాశంలోనే ప్రమాదకరమైన ఆయుధాలను మోహరిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. భూమికి దాదాపు 600 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో చైనా చేసిన ఒక రహస్య ప్రయోగం ఇప్పుడు ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. చైనాకు చెందిన ఒక టాప్ సీక్రెట్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో ఒక వింత వస్తువును వదిలిపెట్టింది. దీనిని గమనించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్, రష్యా స్పేస్ ఏజెన్సీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ వస్తువు ఏంటో తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.
న్యూజిలాండ్ రాడార్‌కు దొరికిన చైనా గుట్టు
జూన్ 22, 2026 నాడు న్యూజిలాండ్‌లో ఉన్న అత్యంత శక్తివంతమైన రాడార్ భూమి కక్ష్యలో ఒక వింత కదలికను గుర్తించింది. అంతరిక్షంలో అంతకుముందు ఎన్నడూ లేని ఒక సరికొత్త ఆబ్జెక్ట్ ప్రయాణిస్తున్నట్లు రాడార్ డేటాలో తేలింది. అది పాత శాటిలైట్ కాదు, కనీసం అంతరిక్ష వ్యర్థం అంతకన్నా కాదు. పాత రికార్డులన్నీ తవ్వి తీశాక శాస్త్రవేత్తలకు అసలు నిజం తెలిసింది. చైనా అత్యంత రహస్యంగా ఉంచే షెన్లాంగ్ అనే స్పేస్ ప్లేన్ పక్కనే ఈ వింత వస్తువు కనిపించింది. అంటే చైనా విమానమే దానిని అక్కడ వదిలేసిందని స్పష్టమైంది.
చైనా డివైన్ డ్రాగన్.. 700 రోజులుగా అంతరిక్షంలో ఏం చేస్తోంది?
ఈ వింత వస్తువును వదిలిన షెన్లాంగ్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రపంచమంతా డివైన్ డ్రాగన్ అని పిలుస్తుంది. దీని అసలు రూపం ఎలా ఉంటుందో, దీని సామర్థ్యం ఏంటో చైనాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించిన ఏ సమాచారాన్నీ చైనా బయటపెట్టదు. ఇదొక విచిత్రమైన అంతరిక్ష నౌక. రాకెట్ ద్వారా స్పేస్‌లోకి వెళ్లే ఈ విమానం, తన మిషన్ పూర్తయ్యాక సాధారణ విమానంలా రన్‌వేపై ల్యాండ్ అవుతుంది. 2020లో మొదటిసారి ఎగిరిన ఈ డ్రాగన్.. ఇప్పటివరకు నాలుగు మిషన్లలో భాగంగా దాదాపు 700 రోజులు అంతరిక్షంలోనే గడిపింది. అక్కడ ఉండి చైనా ఏం చేస్తోందనేది ఇప్పటికీ ఒక మిస్టరీ.
శాటిలైట్లను పేల్చేసే స్పేస్ వెపన్?
చైనా అంతరిక్షంలో వదిలిన ఆ చిన్న వస్తువులపై ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని చిన్న క్యూబ్‌శాట్ అంటుంటే, మిలిటరీ నిపుణులు మాత్రం ఇదొక ప్రమాదకరమైన స్పేస్ వెపన్ అని హెచ్చరిస్తున్నారు. నేటి కాలంలో శాటిలైట్లు అంటే కేవలం టీవీ ప్రసారాలకో, వాతావరణ సమాచారానికో మాత్రమే కాదు. సైన్యం కదలికలు, డ్రోన్ల నిర్వహణ, జీపీఎస్ నావిగేషన్, క్షిపణుల దిశను నిర్దేశించడం, అణ్వాయుధాల లాంచింగ్.. అన్నీ శాటిలైట్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ వాటిని నాశనం చేస్తే శత్రు సైన్యం ఒక్కసారిగా అంధురాలైపోతుంది.
ముందుగా హెచ్చరికలు ఉండవు
భవిష్యత్తులో ఒకవేళ అణు యుద్ధం లాంటి పరిస్థితి వస్తే, దాడి చేసే దేశం శత్రువుకు ఎలాంటి హెచ్చరికా ఇవ్వదు. నేరుగా నౌకౌట్ చేసేందుకే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే చైనా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకుంటోంది. మొదట శత్రుదేశాల శాటిలైట్లను అంతరిక్షంలోనే అచేతనం లేదా ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత ఎయిర్‌బేస్‌లను, న్యూక్లియర్ సైట్లను బాంబులతో ముంచెత్తుతారు. చైనా కంటే ముందే అమెరికా, రష్యాలు యాంటీ-శాటిలైట్ (ASAT) ఆయుధాలను తయారు చేసుకున్నాయి. రష్యా 2021లో తన సొంత ఉపగ్రహాన్ని మిసైల్‌తో పేల్చేసింది. చైనా కూడా 2007లోనే ఈ ప్రయోగం చేసి తాము కూడా రేసులో ఉన్నామని నిరూపించుకుంది.
రష్యా న్యూక్లియర్ ప్లాన్.. ముప్పులో 7000 అమెరికా శాటిలైట్లు
పాశ్చాత్య మీడియా కథనాల ప్రకారం.. రష్యా కూడా అంతరిక్షంలో ఒక అణు ఆధారిత వ్యవస్థ పై పనిచేస్తోంది. ఇది అమెరికాకు చెందిన వేలాది శాటిలైట్లను క్షణాల్లో నిర్వీర్యం చేయగలదు. అమెరికాకు చెందిన 7000కు పైగా ఉపగ్రహాలు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఇప్పుడు ముప్పులో పడ్డాయి. ఒకవేళ ఈ స్పేస్ వార్ గనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలుతుంది. జీపీఎస్ బంద్ అవుతుంది, బ్యాంకింగ్ రంగానికి బ్రేకులు పడతాయి. అంతరిక్షాన్ని ఎవరు శాసిస్తే.. వాళ్లే ప్రపంచాన్ని ఏలుతారనే సూత్రంతోనే చైనా ఈ హారర్ ప్లాన్ అమలు చేస్తోంది.




