South Sudan: సంక్షోభాల సుడిగుండంలో సౌత్‌ సూడాన్‌... స్వతంత్య్రం వచ్చినా కనిపించని భద్రత

ఆఫ్రికా ఖండంలోని సౌత్‌ సూడాన్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. 15వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Balachander
Published on: 9 July 2026 9:24 AM IST
South Sudan: సంక్షోభాల సుడిగుండంలో సౌత్‌ సూడాన్‌... స్వతంత్య్రం వచ్చినా కనిపించని భద్రత
X

South Sudan: ప్రపంచ పటంలో అత్యంత పిన్న వయస్కుడైన దేశంగా అవతరించిన సౌత్ సూడాన్ నేడు తన 15వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, సూడాన్‌తో సాగిన రక్తపాత అంతర్యుద్ధం తర్వాత 2011లో ఒక కొత్త ఆశతో ఈ దేశం జన్మించింది. అయితే, ఆ నాడు ప్రజలు కన్న కలలు నేడు ఛిద్రమయ్యాయి. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాల్సిన దేశం నేడు అంతర్గత కలహాలు, పేదరికం, అవినీతి, తీవ్రమైన మానవీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2018లో కుదిరిన పునరుద్ధరించిన శాంతి ఒప్పందం దేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న యుద్ధాన్ని ఆపగలిగింది కానీ, ఆ ఒప్పందంలో పేర్కొన్న హామీలు నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా సగటు పౌరుడికి కనీస హక్కులైన వైద్యం, తాగునీరు కూడా లగ్జరీగా మారిపోయాయి.

15 ఏళ్ల స్వతంత్ర పాలన...ప్రధాన సవాళ్లు

అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, క్షేత్రస్థాయి సామాజిక కార్యకర్తల సమాచారం ప్రకారం.. సౌత్ సూడాన్ అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. 2018 నాటి శాంతి ఒప్పందంలో ఇప్పటి వరకు కేవలం 25 శాతం కంటే తక్కువ నిబంధనలు మాత్రమే అమలు జరిగాయి. సైనికంగా అమలు చేయవలసిన సంస్కరణలు, ఏకీకృత రక్షణ దళాల ఏర్పాటు నత్తనడకన సాగుతున్నది. దీంతో అంతర్గత రక్షణ వ్యవస్థలు బలహీనపడ్డాయి. అప్పర్ నైల్, జోంగ్లీ వంటి రాష్ట్రాల్లో స్థానిక తెగల మధ్య ప్రతీకార దాడులు, పశువుల దొంగతనాలు, అపరిచిత దుండగుల కాల్పులు నిత్యకృత్యమయ్యాయి. శాంతి ఒప్పందంలో మహిళలకు కేటాయించిన 35 శాతం కోటా కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. సరిహద్దు దేశమైన సూడాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా దాదాపు 12 లక్షల మంది శరణార్థులు, స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులు సౌత్ సూడాన్‌కు చేరుకున్నారు. దీనితో ద్రవ్యోల్బణం పెరిగి, నిరుద్యోగం, ప్రభుత్వ వేతనాల నిలిపివేతతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

క్షీణిస్తున్న మానవతా పరిస్థితులు... వైద్య సంక్షోభం

ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ నివేదికల ప్రకారం.. దేశంలో ఘర్షణలు పెరగడం వల్ల క్షతగాత్రుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జుబా మిలిటరీ హాస్పిటల్ తన సామర్థ్యానికి మించి రోగులతో నిండిపోయింది. దీంతో ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తున్నాయి. అత్యవసర చికిత్సలు అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు. దీంతో వైద్యం అందక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం తాగేందుకు నీరు కూడా కరువు కావడంతో దప్పిక తీర్చుకోలేక మరణాలు సంభవిస్తున్నాయి.

ఎన్నికలకు సిద్దం

సౌత్ సూడాన్ చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది డిసెంబర్‌ 22న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే, కేవలం ఎన్నికలు జరపడం వల్లే ప్రజాస్వామ్యం సిద్ధించదని, దేశంలో అవినీతి నిర్మూలన, తెగల మధ్య సమ్మతి, బలమైన సంస్థల నిర్మాణం జరిగితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూడాన్‌ ప్రజలు కోరుకుంటోంది కూడా ఇదే. కానీ, సౌత్ సూడాన్ పాలకుల రాజకీయ స్వార్థం, బలహీనమైన పరిపాలన వల్ల అంతర్జాతీయ సహాయక నిధులు కూడా తగ్గిపోతున్నాయి. 15 ఏళ్ల స్వతంత్ర దేశ చరిత్రలో ఈ వార్షికోత్సవం సంబరపడటానికి కాదు, పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఒక సందర్భం. పాలకులు తమ సొంత ప్రయోజనాలను పక్కనబెట్టి పౌరులకు రక్షణ కల్పించినప్పుడే సౌత్ సూడాన్ సంక్షోభాల సుడిగుండం నుండి బయటపడగలదు. లేదంటే దేశం ఏర్పడినా ఉపయోగం లేదు. నిత్య సంఘర్షణలతో మరో ఏడాది ముగిసిపోతుంది తప్ప.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story