Saudi Aramco : సౌదీ అరేబియాలో కూలిన హెలికాప్టర్‌.. 14 మంది మృతి..

Saudi Aramco : మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడిప్పుడే శాంతి వాతావరణం నెలకొంటున్న తరుణంలో సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

G Krishna
Published on: 29 Jun 2026 8:51 AM IST
helicopter crash
X

helicopter crash

Saudi Aramco : మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడిప్పుడే శాంతి వాతావరణం నెలకొంటున్న తరుణంలో సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన సౌదీ ప్రభుత్వ రంగ సంస్థ 'సౌదీ అరామ్‌కో' (Saudi Aramco) కు చెందిన ఒక హెలికాప్టర్ ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఈ భీకర ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మంది సిబ్బంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరణించిన వారంతా సౌదీ అరేబియా పౌరులేనని, చమురు రంగానికి చెందిన కీలక అధికారులని సౌదీ అధికారిక వార్తా సంస్థ 'సౌదీ ప్రెస్ ఏజెన్సీ' (SPA) ధృవీకరించింది.

ఉదయం 6 గంటలకే కుప్పకూలిన చాపర్.. కారణాలపై సస్పెన్స్

సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఆదివారం (జూన్ 28, 2026) ఉదయం సుమారు 6:00 గంటల ప్రాంతంలో రాస్ తనూరా (Ras Tanura) ఆకాశంలో ప్రయాణిస్తున్న సౌదీ అరామ్‌కో హెలికాప్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నేలకూలింది. "సౌదీ అరామ్‌కో ద్వారా నడపబడుతున్న హెలికాప్టర్ రాస్ తనూరాలో ప్రమాదానికి గురైందని ప్రకటించడానికి ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న 14 మంది వ్యక్తులు అమరులయ్యారు. వారంతా సౌదీ జాతీయులే" అని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. వాతావరణంలో మార్పుల వల్ల జరిగిందా? లేక సాంకేతిక లోపమా? అనే కోణంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం సౌదీ వైమానిక దళం, పౌర విమానయాన సంస్థలు , అరామ్‌కో భద్రతా విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించాయి.

నాలుగు నెలల తర్వాత తెరుచుకున్న టెర్మినల్.. అంతలోనే ఘోరం

ఈ ప్రమాదం జరిగిన సమయం, స్థలం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఘోర ప్రమాదం జరిగిన 'రాస్ తనూరా' చమురు టెర్మినల్ ప్రపంచ ఇంధన మార్కెట్‌కే గుండెకాయ లాంటిది. ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో, అంతర్జాతీయంగా అత్యంత వివాదాస్పదమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) జలసంధి వ్యూహాత్మక తీరంలో ఉంది. గత నాలుగు నెలలుగా మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న భీకర యుద్ధం కారణంగా రాస్ తనూరా టెర్మినల్ నుండి చమురు లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

అయితే, ఇరాన్-అమెరికాల మధ్య యుద్ధాన్ని తాత్కాలికంగా ముగించేందుకు ఇటీవలే ఒక అంతర్జాతీయ మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే, సుదీర్ఘ విరామం తర్వాత గత శుక్రవారమే ఈ కీలక టెర్మినల్ నుండి ముడి చమురు ఎగుమతులను సౌదీ అరామ్‌కో అధికారికంగా పునఃప్రారంభించింది. అంతర్జాతీయంగా చమురు కొరతను అధిగమించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా యుద్దప్రాతిపదికన తన ఎగుమతులను పెంచే క్రమంలో ఈ హెలికాప్టర్ నిఘా కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. టెర్మినల్ పునఃప్రారంభమైన కేవలం రెండు రోజుల్లోనే ఈ ఘోర ప్రమాదం జరగడం సౌదీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఆందోళన

పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, గల్ఫ్ దేశాలన్నీ తమ చమురు, సహజ వాయువు ఉత్పత్తిని , ఎగుమతులను ముమ్మరం చేయడానికి పోటీ పడుతున్నాయి. ఈ రద్దీ సమయంలో జరిగిన ఈ హెలికాప్టర్ క్రాష్‌తో అరామ్‌కో సంస్థలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడతాయని అంతర్జాతీయ చమురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story