Saudi Arabia Rain News : ఎడారి దేశంలో జలప్రళయం.. అల్లకల్లోలంగా మారిన సౌదీ అరేబియా.. స్కూళ్లు, కాలేజీలు బంద్
Saudi Arabia Rain News : సౌదీ అరేబియాలో భారీ వర్షాలు, తుపానుల బీభత్సం సృష్టిస్తున్నాయి. రియాద్ సహా పలు ప్రావిన్సుల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వరదలతో రహదారులు జలమయమయ్యాయి.
Saudi Arabia Rain News
Saudi Arabia Rain News : సౌదీ అరేబియా మీద ప్రకృతి కన్నెర్రజేసింది. ఎడారి దేశాన్ని భారీ వర్షాలు, తుపాను గాలులు వణికిస్తున్నాయి. రాజధాని రియాద్‌తో పాటు పలు కీలక ప్రావిన్సుల్లో జనజీవనం అతలాకుతలమైంది. వాతావరణం దారుణంగా దెబ్బతినడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడమే కాకుండా, అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్‌లో ఉంచింది.
సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తుపానుల కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్, అల్-అహసా, అసిర్ ప్రావిన్సుల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తైఫ్ యూనివర్సిటీ వంటి పెద్ద విద్యా సంస్థలు తమ క్లాసులను ఆన్‌లైన్ మోడ్‌లోకి మార్చేశాయి. కింగ్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా తన అల్-అహసా బ్రాంచ్‌కు సెలవు ఇచ్చింది. వాతావరణం కుదుటపడే వరకు విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు.
రాజధాని రియాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుపానులు రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్-అహసా ప్రావిన్సులో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జజాన్, అసిర్, అల్-బహా ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలి వేగం గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
వరదలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ సర్వసన్నద్ధమైంది. రియాద్‌లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాఫ్ (RAF) బృందాలను సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. 997 హాట్‌లైన్ నంబర్‌తో పాటు అసిఫ్నీ, తవక్కల్నా, అబ్షేర్ వంటి యాప్‌ల ద్వారా ప్రజలు సాయం కోరవచ్చని అధికారులు సూచించారు.
వాతావరణం అస్థిరంగా ఉన్నందున నివాసితులందరూ అధికారిక భద్రతా సూచనలను పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలకు, వాగులు, వంకల దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వాలని, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందుల్లో పడవద్దని కోరింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామని, వాతావరణం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.




