అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత... నాటో విస్తరణకు చెక్ పడుతుందా?
ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో అమెరికా పరపతి కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమైంది. అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న యూరప్‌లో చాలా మటుకు అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి.
Anti-US Sentiment NATO : ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో అమెరికా పరపతి కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమైంది. ముఖ్యంగా అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న యూరప్‌లో చాలా మటుకు అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. ఇటలీ, స్పెయిన్ దేశాలు బహిరంగంగానే అమెరికాపై వ్యతిరేకతను ప్రకటించగా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు తమ యుద్ధ స్థావరాలను వినియోగించుకునేందుకు వీలు కల్పించలేదు. నాటో దేశాలే అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో నాటోను పేపర్ పులి అని, అమెరికా లేకుండా నాటో జీరో అని ట్రంప్ వర్ణిస్తూ వస్తున్నాడు. హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా ఆగిపోతుండటం, పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో యూరప్ దేశాల ఇబ్బందులు మరింత తీవ్రమౌతున్నాయి. చమురు లేకుంటే యూరప్ దేశాల్లో కరువుకాటకాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థికమాంద్యం పెరుగుతంది. సమస్యలు జటిలమౌతుంటాయి. సహాయం చేయాలని కోరిన అమెరికాకు నాటో దేశాలు మొండిచేయి చూపడంతో ట్రంప్ వాటిపై ఎలాగైనా ఆధిపత్యం చలాయించాలని పట్టుదలతో ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే మరోసారి గ్రీన్‌ల్యాండ్ మాటను తెరపైకి తీసుకొస్తున్నారు.
గ్రీన్లాండ్ వివాదం
గ్రీన్‌ల్యాండ్ దేశమైనప్పటికీ ఇది డెన్మార్క్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో స్వతంత్య్ర పాలన ఉన్నా... డెన్మార్క్ ఆధీనంలో ఉండటంతో అదికూడా నాటో దేశంగానే పరిగణిస్తున్నారు. నాటో రూల్ ప్రకారం...నాటో దేశంలో ఏదైనా దేశం దాడి చేస్తే... మిగతా సభ్య దేశాలు దాడికి దిగాలి. అమెరికా గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలని చూస్తే... నాటో రూల్‌ను అధిక్రమించినట్టు అవుతుంది. అమెరికాకు వ్యతిరేకంగా నాటో దేశాలు పోరాటం చేయాలి. అంటే, నాటో దేశాల మధ్యనే యుద్ధం జరుగుతుంది. నాటోకు అర్థం లేకుండా పోతుంది. నాటోకు సహాయం కావాలంటే అమెరికా కావాలి, కానీ, అమెరికాకు సహాయం చేయాలంటే నాటో దేశాలు ముందుకు రావని ట్రంప్ పదేపదే మాటల తూటాలను పేలుస్తున్నాడు. ఇది రెచ్చగొట్టే వ్యవహారమే అయినప్పటికీ నాటో దేశాలు పెద్దగా స్పందించడం లేదు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇటలీ పార్లమెంట్లో జోకులు పేలుతున్నాయంటే... ట్రంప్ మాటలను ఆయా దేశాలు ఎలా తీసుకుంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
వ్యతిరేకతకు కారణం
ఫస్ట్ అమెరికా అనే నినాదంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడుల వలన అమెరికాకు కూడా భారీగా నష్టపోయింది. వందల బిలియన్ డాలర్ల విలువైన గగనతల రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విదేశాల్లోని అమెరికా యుద్ధ స్థావరాలు దెబ్బతిన్నాయి. వీటిని రిపేర్ చేయడానికి భారీగా ఖర్చు అవుతుంది. ఇరాన్‌పై ఇంతలా దాడి చేసి సాధించింది ఏమిటి అంటే శూన్యమే. ఇరాన్ లొంగిపోలేదు. యూరేనియంను అప్పగించేందుకు సిద్దంగా లేదు. హోర్ముజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. అమెరికాకు అంత బలమే ఉంటే హూర్ముజ్లోకి చొచ్చుకుపోయి దాడి చేయవచ్చు కదా. ఎందుకు ఈ పనిచేయడం లేదు. హోర్ముజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకోవడం అంత సులభం కాదని అమెరికాకు అర్ధమైంది. అటు సొంతదేశంలోనూ అమెరికాపై ఒత్తిడి, ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతున్నది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో నాటో విస్తరణ జరుగుతుందా అంటే లేదనే నిపుణులు చెబుతున్నారు. నాటో విచ్చిన్నం కాకుండా చూసుకోవడమే ఇప్పుడున్న కర్తవ్యమని నిపుణులు చెబుతున్నారు.




