Earthquake: భయంకర భూకంపం.. 7.4 తీవ్రతతో కంపించిన భూమి.. 111 మంది మృతి
Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల 111 మంది ప్రాణాలు కోల్పోయారు.
Colombia Earthquake
Earthquake: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి పలు బహుళ అంతస్తుల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదిక ప్రకారం.. భూకంప ప్రారంభ తీవ్రత 7.4గా నమోదు కాగా, ఇది భూమి అంతర్భాగంలో 115 కిలోమీటర్ల లోతున సంభవించింది. కాగా కొలంబియా జియోలాజికల్ సర్వీస్ మాత్రం ప్రారంభ తీవ్రతను 6.7గా పేర్కొంది. భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప ప్రకంపనలు రాజధాని బొగోటాతో పాటు పొరుగు దేశాలైన వెనిజులా, ఈక్వెడార్‌లలో కూడా స్పష్టంగా కనిపించాయి.
ఈ భూకంప కేంద్రం రాజధాని బొగోటాకు పశ్చిమాన దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ జోస్ డెల్ పాలమార్ సమీపంలో నమోదైంది. కొలంబియాకు చెందిన నేషనల్ యూనిట్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రకారం భూకంప తీవ్రత 7.4గా, లోతు 79 కిలోమీటర్లుగా తెలిపింది. చోకో ప్రావిన్స్ గవర్నర్ నుబియా కరోలినా కార్డోబా-క్యూరీ మాట్లాడూతూ.. ప్రావిన్స్ రాజధాని క్విబ్డోలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని, అనేక భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారు.
దక్షిణ అమెరికాలో భూకంప ముప్పు అత్యధికంగా ఉన్న దేశాల్లో కొలంబియా ఒకటి. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులు, ప్రధాన ఫాల్ట్ సిస్టమ్‌ల వద్ద ఈ దేశం విస్తరించి ఉండటమే దీనికి కారణం. కొలంబియా జియోలాజికల్ సర్వీస్ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 100కి పైగా వినాశకర భూకంపాలు సంభవించాయి. ముఖ్యంగా ఆండియన్ ప్రాంతం, ఈస్టర్న్ కార్డిల్లెరా తూర్పు భాగాలు, పసిఫిక్ తీర ప్రాంతాలు భూకంపాల బారిన పడే అత్యంత ప్రమాదకర మండలాలుగా ఉన్నాయి.గతంలో 1979లో నైరుతి కొలంబియాలోని టుమాకో సమీపంలో 8.0 తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ప్రస్తుతం వచ్చిన 7.4 తీవ్రత భూకంపం కూడా ఇటీవలి దశాబ్దాలలో వచ్చిన అతిపెద్ద భూకంపాలలో ఒకటిగా నిలిచింది.
ఒక్క కొలంబియాలోనే కాకుండా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యూషులోని కుమామోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ ఏజెన్సీ ప్రకారం.. ఈ భూకంపం సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. టోక్యోకు నైరుతి దిశలో 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమామోటో పశ్చిమ ప్రాంతంపై ఇది ప్రభావం చూపింది. ప్రస్తుతం కొలంబియా, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో క్షతగాత్రులకు వైద్యం అందించడం, సహాయక చర్యలు వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు.




