PM Modi : ప్రధాని మోదీ ఖాతాలో మరో రికార్డు.. అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన స్లోవేకియా
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి స్లోవేకియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ను అందజేసింది. మోదీకి లభించిన 33వ అంతర్జాతీయ గౌరవం ఇది.
PM Modi
PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ దౌత్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. తన వారం రోజుల యూరప్ పర్యటనలో భాగంగా స్లోవేకియా చేరుకున్న పీఎం మోదీకి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర సైనిక పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్)ను అందించి ఘనంగా గౌరవించింది. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఒక ప్రత్యేక అధికారిక వేడుకలో ప్రధాని మోదీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ఒక విదేశీ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఇలాంటి అత్యున్నత పురస్కారాన్ని అందించడం ఇది 33వ సారి కావడం గమనార్హం.
రెండు దేశాల స్నేహ బంధానికి ప్రతీక
స్లోవేకియా దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, అంతర్జాతీయ వేదికలపై పరస్పర మైత్రిని పెంపొందించడంలో మరియు ఆ దేశ విదేశాంగ విధానానికి మద్దతుగా నిలిచిన అంతర్జాతీయ ప్రముఖులకు మాత్రమే ఈ ద ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అవార్డును అందజేస్తారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు కేవలం తనకు లభించిన గౌరవం కాదని, 140 కోట్ల మంది భారత ప్రజల గౌరవమని, దీనిని భారత్-స్లోవేకియా దేశాల శాశ్వత స్నేహానికి అంకితం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
తొలిసారిగా ఒక భారత ప్రధాని పర్యటన
భారతదేశ చరిత్రలోనే స్లోవేకియా దేశంలో ఒక భారత ప్రధానమంత్రి అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక పర్యటన కేవలం అవార్డులకే పరిమితం కాకుండా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లింది. పర్యటనలో భాగంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చలు అత్యంత విజయవంతమయ్యాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక సహకారాన్ని భారీగా పెంచాలని ఇరు దేశాల అధినేతలు ఒక బలమైన సంకల్పాన్ని ప్రకటించారు.
11 కీలక రంగాలలో చారిత్రాత్మక ఒప్పందాలు
ఈ ఉన్నత స్థాయి చర్చల అనంతరం భారత్, స్లోవేకియా దేశాలు వివిధ రంగాలలో పరస్పర సహకారం కోసం ఏకంగా 11 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో ప్రధానంగా వలసల నియంత్రణ, డిజిటల్ టెక్నాలజీ ఎక్స్ఛేంజ్, డిఫెన్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటితో పాటు భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య జరగబోయే ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని వేగంగా అమలు చేయడానికి ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది.
రక్షణ ఇంధన రంగాల్లో సరికొత్త వ్యూహాలు
రెండు దేశాల రక్షణ రంగాల మధ్య కుదిరిన ఒప్పందం ఇరుపక్షాల మధ్య ఉన్న పరస్పర నమ్మకానికి నిదర్శనమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. రక్షణ సహకారానికి సంబంధించిన ఒక ప్రత్యేక పత్రాన్ని ఇరు దేశాలు ఖరారు చేశాయి. వీటితో పాటు భవిష్యత్తు ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని అణుశక్తి , జియోథర్మల్ ఎనర్జీ రంగాలలో కలిసి పనిచేయడానికి మోదీ, రాబర్ట్ ఫికోలు అంగీకరించారు. భారతదేశానికి, స్లోవేకియాకు ఆటోమొబైల్, రైల్వేస్, మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ టెక్నాలజీ రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఈ ఒప్పందాలు ఇరు దేశాల ప్రజల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.




