Plane Crash : ఘోర విమాన ప్రమాదం.. పర్యాటకుల విమానం కూలి 13 మంది దుర్మరణం

Plane Crash : పెరూలోని ప్రసిద్ధ ప్రపంచ వారసత్వ సంపద నాజ్కా లైన్స్ వీక్షించేందుకు వెళ్లిన పర్యాటకుల చిన్న విమానం కూలిపోయిన ప్రమాదంలో 13 మంది మరణించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

CR Reddy
Published on: 2 Aug 2026 6:38 AM IST
Plane Crash
X

Plane Crash

Plane Crash : దక్షిణామెరికా దేశమైన పెరూలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం పర్యాటకులను తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం సడన్‌గా ప్రమాదానికి గురై కూలిపోయింది. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెరూలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన నాజ్కా లైన్స్ వీక్షించడానికి పర్యాటకులు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై స్థానిక అధికారులు తక్షణమే స్పందించి విచారణ ప్రారంభించారు.

టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే..

పెరూకు చెందిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఎరోడియానా ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తోంది. స్థానిక నివేదికల ప్రకారం.. ఈ విమానం కొలంబో ప్రాంతంలోని ఎయిర్‌పోర్ట్ నుంచి పర్యాటకులకు ఆకాశం నుంచి నాజ్కా లైన్స్ చూపించడానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం నాజ్కా నగరం వెలుపల ఉన్న ఎడారి మైదానంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

సోషల్ మీడియాలో మంటల దృశ్యాలు

ప్రమాదం జరిగిన తీరును వివరించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎడారి లాంటి మైదానంలో విమాన భాగాలు చెల్లాచెదురుగా పడిపోయి, పొగలు కక్కుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. నాజ్కా నగర ప్రభుత్వం కూడా ఫేస్‌బుక్ ద్వారా ఈ విమాన ప్రమాదాన్ని ధృవీకరించింది. ఎరోడియానా సంస్థ గడిచిన 14 సంవత్సరాలుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాలతో ఇక్కడ పర్యాటకులకు సైట్‌సీయింగ్ సేవలు అందిస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.

వాతావరణం అనుకూలించకనే ప్రమాదమా?

ఈ విమాన ప్రమాదానికి వాతావరణ పరిస్థితులే కారణమై ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. ప్రమాదానికి ముందు రోజు మరియా రీచే ఎయిర్‌పోర్ట్ నుంచి పర్యాటక విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో గంటకు 40 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలిగాలులు వీచడంతో ఎడారిలోని దుమ్ము రేగి విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో చాలా విమానాలను వేరే ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఈ క్రమంలోనే శనివారం కూడా విజిబిలిటీ లోపించడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఏమిటీ నాజ్కా లైన్స్ ?

నాజ్కా లైన్స్ అనేది యునెస్కో గుర్తింపు పొందిన పురాతన మైదాన ప్రాంతం. ఎడారి నేలపై వందల సంవత్సరాల క్రితం పెరూ పురాతన నివాసితులు రాళ్లను తొలగించి జంతువులు, పక్షులు మరియు ఇతర విచిత్రమైన రేఖాగణిత ఆకారాల బొమ్మలను తయారు చేశారు. ఇవి ఎంతో విస్తారమైన భూభాగంలో ఉండటంతో వీటిని కింద నుంచి చూడటం సాధ్యం కాదు. కేవలం ఆకాశంలో విమానాల్లో వెళ్తూ లేదా వ్యూయింగ్ టవర్ల పైనుంచి మాత్రమే చూడగలరు. అందుకే ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైగా పర్యాటకులు విమానాల్లో వీటిని చూడటానికి పెరూ వస్తుంటారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story