Earthquake : అండీస్ ప్రాంతాన్ని వణికించిన 5.5 భూకంపం.. ఐదుగురు మృతి, వందల భవనాలు నేలమట్టం
Earthquake : పెరూ దేశంలోని అండీస్ ప్రాంతంలో 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
Earthquake
Earthquake : దక్షిణ అమెరికా దేశమైన పెరూలోని అండీస్ పర్వత ప్రాంతాన్ని ఆదివారం ఒక భయంకరమైన భూకంపం కుదిపివేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ హఠాత్ పరిణామంతో అండీస్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. భూ ప్రకంపనల ధాటికి అనేక గృహాలు, చర్చిలు, కాన్వెంట్లు ఇతర ప్రభుత్వ భవనాలు క్షణాల వ్యవధిలోనే ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రమాదకర భూకంపం భూమి లోపల కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడం వల్ల ఉపరితలంపై నష్టం చాలా ఎక్కువగా జరిగింది. హువాంకాయో ప్రావిన్స్‌లోని సికాయా నగరానికి పశ్చిమ-నైరుతి దిశలో 2 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం ధాటికి కనీసం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పెరూలో సహాయక చర్యలు జారీ
ఈ విపత్తులో 20 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంపం ధాటికి నివాస గృహాలు పూర్తిగా నేలమట్టం కావడంతో దాదాపు 300 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెరూ నేషనల్ సివిల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇంకా ఎంతమంది గల్లంతయ్యారో స్పష్టమైన సమాచారం లభించలేదని, గాలింపు చర్యలు వేగవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
మట్టి ఇటుకలే ముంచేశాయి
అండీస్ ప్రాంతంలో సంభవించిన ఈ విధ్వంసానికి స్థానిక నిర్మాణ శైలి కూడా ఒక ప్రధాన కారణమని సివిల్ డిఫెన్స్ ఆఫీస్ హెడ్ లూయిస్ వాస్క్యూజ్ తెలిపారు. అక్కడ ఇళ్లను ఎక్కువగా ఎడోబ్ అంటే పచ్చి మట్టి ఇటుకలతో నిర్మించడం వల్ల భూకంప ధాటికి ఇళ్లు త్వరగా కూలిపోయి నష్టం తీవ్రతరమైంది. నిజానికి పెరూ దేశం పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ తరచూ బలమైన భూకంపాలు సంభవిస్తుంటాయి.
2007 పిస్కో ప్రాంత భూకంప జ్ఞాపకాలు
ఈ దారుణ దృశ్యాలు ప్రసార సాధనాల్లో ప్రసారమవ్వడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. చోంగో బాజో వంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ప్రజలు తమ సర్వస్వం కోల్పోయి, తీవ్ర చలిలో దుప్పట్లు కప్పుకుని ధ్వంసమైన ఇళ్ల ముందే దీనంగా కూర్చున్నారు. ఇళ్ల శిథిలాల కింద మూగజీవాలు కూడా చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. ఈ పరిస్థితి 2007లో ఇకా ప్రాంతంలోని పిస్కో ప్రావిన్స్‌లో సంభవించిన 7.9 తీవ్రత నాటి భయంకర భూకంప జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. నాటి ప్రమాదంలో ఏకంగా 600 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు మళ్లీ అలాంటి భయమే ప్రజలను వెంటాడుతోంది.




