Pentagon Secret Report: భయపెడుతున్న పెంటగాన్‌ సీక్రెట్‌ రిపోర్ట్‌... ఆరునెలల్లో అంతా ఖాళీ

Pentagon Secret Report: పశ్చిమాసియా రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Balachander
Published on: 23 April 2026 11:00 AM IST
Pentagon Secret Report
X

Pentagon Secret Report

Pentagon Secret Report: పశ్చిమాసియా రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, తాజాగా అమెరికా రక్షణశాఖ, పెంటగాన్‌ విడుదల చేసిన రహస్య నివేదిక ప్రకారం, చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకోవడానికి కనీసం ఆరునెలల సమయం పడుతుందని నివేదికలో పేర్కొంది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

పెంటగాన్ రహస్య సమావేశం - అసలేం జరిగింది?

అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌లో అధికారులు, చట్టసభల సభ్యులతో కూడిన ఓ రహస్యభేటీని నిర్వహించారు. ఈ భేటీలో ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అందరు ఆశిస్తున్న సమయంలో హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ అమర్చిన సీ మైన్స్‌ పెద్ద తలనొప్పిగా మారినట్టు అమెరికా డిఫెన్స్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ జలసంధిలో సుమారు 20 వరకు అత్యంత శక్తివంతమైన మైన్స్‌ను ఇరాన్‌ అమర్చినట్టు పెంటగాన్‌ సమాచారం. అంతేకాదు, ఈ మైన్స్‌లో చాలా వరకు జీపీఎస్‌ సాంకేతికతో అమర్చారని, వీటిని గుర్తించి తొలగించడం దాదాపు అసాధ్యమని తెలియజేసింది. ఇరాన్‌ కోఆర్టినేషన్‌ లేకుండా వీటిని తీయలేమని తెలియజేసింది. అయితే, యుద్ధవాతావరణం పూర్తిగా తొలగిపోయి... సీమైన్స్‌ను జాగ్రత్తగా తొలగించాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుందని నివేదికలో పేర్కొంది. ఈ విషయం ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడనున్న ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సింహభాగం ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్లాలి. ఇప్పుడు అక్కడ రవాణా నిలిచిపోతే కలిగే నష్టాలు ఊహాతీతం. చమురు సరఫరా తగ్గిపోతే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెట్టింపు అవుతాయి. ఇప్పటికే ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న యూరప్‌ దేశాలు, చమురుపై ఆధారపడే భారత్‌ వంటి ఆసియా దేశాల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. రవాణా స్తంభించిపోతే మరోసారి కరోనా వంటి లాక్‌డౌన్‌ విధించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితి తలెత్తితే దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

అమెరికాపై ఒత్తిడి

ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తే...దానికి ట్రంప్‌ యంత్రాంగం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ట్రంప్‌ అధికారిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. అయితే, పెంటగాన్‌ ఈ నివేదికపై అధికారికంగా స్పందించనప్పటికీ లోలోపల జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చమురు ధరలు పెరిగితే అది కేవలం ఆర్థిక సమస్యగా మాత్రమే మిగిలిపోకుండా రాజకీయ అస్థిరతకు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే... రాబోయే ఆరు నెలలు ప్రపంచం మొత్తానికి అగ్నిపరీక్షే. అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు, ఇరాన్‌ను మెత్తగా ఒప్పించే ప్రయత్నం చేయాలి. దౌత్య ప్రయత్నాలు ప్రారంభించాలి. సీమైన్స్‌ను త్వరగా తొలగించేందుకు సాయశక్తుల ప్రయత్నించాలి. అప్పుడే ప్రపంచం మనుగడ సాగిస్తుంది. సామాన్యుడికి ఊరట లభిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story