Palestine: పాలస్తీనా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం... 20 ఏళ్ల తరువాత తొలిసారి ఎన్నికలు

దాదాపు 20 ఏళ్ల తరువాత పాలస్తీనాలో ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడి పరిపాలన వర్గాలు అంగీకరించాయి. అయితే, గాజా, వెస్ట్‌బ్యాంక్‌, జెరూసలెంలో ఎన్నికల నిర్వహణపై సందిగ్దత నెలకొంది.

Balachander
Published on: 10 July 2026 9:42 AM IST
Palestine: పాలస్తీనా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం... 20 ఏళ్ల తరువాత తొలిసారి ఎన్నికలు
X

Palestine: పాలస్తీనా రాజకీయ ముఖచిత్రంలో ఒక కీలకమైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గత 20 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న దేశ శాసనసభ ఎన్నికలను ఈ ఏడాది నవంబర్ 28వ తేదీన నిర్వహించబోతున్నట్లు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఒక అధికారిక ఉత్తర్వు ద్వారా ప్రకటించారు. ఆక్రమిత పశ్చిమ తీరం వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, తీవ్ర యుద్దప్రాతిపదికన ఉన్న గాజా స్ట్రిప్‌తో సహా అన్ని పాలస్తీనా భూభాగాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ అధ్యక్ష ఎన్నికలు కూడా ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే, ఈ ప్రకటన వెనుక కేవలం ప్రజాస్వామ్య పునరుద్ధరణ మాత్రమే లేదు, అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన తీవ్రమైన వ్యూహాత్మక ఒత్తిడి ప్రధాన కారణం కావొచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ ఒత్తిడి ... సంస్కరణల దిశగా

90 ఏళ్ల వృద్ధుడైన మహ్మద్ అబ్బాస్ 2005 లో కేవలం నాలుగేళ్ల ఏళ్ల పదవీకాలం కోసం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ, అప్పటినుంచి ఎన్నికలు జరగకపోవడంతో ఆయనే అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో పాలస్తీనా అథారిటీలో అవినీతి పెరిగిపోయిందని, దానికి ప్రజామోదం లేదని ఫ్రాన్స్, సౌదీ అరేబియా వంటి శక్తివంతమైన దేశాలు భావించాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాలస్తీనాకు అంతర్జాతీయ సహాయం అందాలంటే ముందుగా రాజకీయ సంస్కరణలు జరగాలని, ఎన్నికల ద్వారా చట్టబద్ధత నిరూపించుకోవాలని ఈ దేశాలు గట్టి నిబంధన విధించాయి. దాతల నిధుల కోసమే అబ్బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

2006 నాటి చేదు అనుభవం

పాలస్తీనాలో చివరిసారిగా 2006 లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అబ్బాస్‌కు చెందిన అధికార 'ఫతా' పార్టీపై తీవ్రవాద సంస్థగా ముద్రపడిన 'హమాస్' ఊహించని విజయం సాధించింది. ఈ ఫలితం ఫతా-హమాస్ మధ్య తీవ్ర అంతర్యుద్ధానికి దారితీసింది. చివరకు 2007 లో గాజా స్ట్రిప్‌ను హమాస్ తన పూర్తి ఆధీనంలోకి తీసుకోగా, వెస్ట్ బ్యాంక్ పరిపాలన మాత్రమే అబ్బాస్ చేతిలో మిగిలింది. అప్పటినుంచి పాలస్తీనా రాజకీయంగా రెండు ముక్కలైంది.

క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లు

ఈ ఎన్నికలు ప్రకటించినప్పటికీ, ఇవి సజావుగా సాగడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. తూర్పు జెరూసలేంలో పాలస్తీనియన్లు ఓటు వేయడానికి ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుంది. గతంలో 2021 లో కూడా ఎన్నికలు ప్రకటించి, ఇజ్రాయెల్ సహకరించకపోవడం వల్లే వాటిని రద్దు చేశారు. గాజాలోని 21 లక్షల జనాభాలో దాదాపు 90 శాతం మంది ఇళ్లు కోల్పోయి శరణార్థులుగా మారారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు, ఓటర్ల జాబితా కూడా అప్‌డేట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ నిర్వహించడం అతిపెద్ద లాజిస్టికల్ సవాలుగా మారనుంది. ఓటర్లను గుర్తించడమే కష్టంగా మారుతుంది. మరి దీనిని పాలస్తీనా ఎన్నికల సంఘం ఎలా అధికమిస్తుందో చూడాలి. అయితే, ప్రస్తుతానికి పాలస్తీనా ప్రజలు ఈ ప్రకటనపై పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. నాయకత్వ మార్పును వారు కోరుకుంటున్నప్పటికీ, ఇజ్రాయెల్ వ్యతిరేకత, అంతర్గత విబేధాల మధ్య ఈ ఎన్నికలు నిజంగా సాధ్యమేనా అనే సందేహాలు వారిలో బలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ నవంబర్ 28 ఎన్నికల నిర్ణయం మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story