Pakistan West Asia Peace Deal: పశ్చిమాసియా శాంతి ఒప్పందాన్ని పాక్‌ ఎలా వాడుకుంది... చైనాతో చిక్కులు తప్పవా?

Pakistan West Asia Peace Deal: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచానికి ఊరటనిచ్చినప్పటికీ, ఈ పరిణామాన్ని పాకిస్థాన్ తన రాజకీయ ప్రయోజనాలకు చాకచక్యంగా వినియోగించుకుంటుందనే చర్చ మొదలైంది.

Balachander
Published on: 8 April 2026 10:28 AM IST
Pakistan West Asia Peace Deal
X

Pakistan West Asia Peace Deal

Pakistan West Asia Peace Deal: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచానికి ఊరటనిచ్చినప్పటికీ, ఈ పరిణామాన్ని పాకిస్థాన్ తన రాజకీయ ప్రయోజనాలకు చాకచక్యంగా వినియోగించుకుంటుందనే చర్చ మొదలైంది.

పాక్‌ ఎత్తుగడలు

ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిగా నిలిచినట్లు చెప్పుకుంటూ అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యతను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, దీని ప్రభావం చైనాతో ఉన్న సంబంధాలపై ఎలా పడుతుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ ఒప్పందం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని, సైన్యాధికారులు కీలక పాత్ర పోషించారని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడం పాక్‌కు డిప్లమాటిక్‌గా ఒక పెద్ద మైలురాయి. గత కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఇది ఒక ఇమేజ్ బూస్టర్‌గా మారింది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి, అంతర్జాతీయ రుణ సంస్థల నమ్మకం పొందడానికి ఈ అంశాన్ని పాక్ ఉపయోగించుకోవాలని చూస్తోంది.

చైనాతో సంబంధాలు

అయితే, ఇదే సమయంలో చైనాతో సంబంధాలు క్లిష్టంగా మారే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్థాన్‌కు అతిపెద్ద మిత్రదేశం చైనానే. చైనా ఇప్పటికే పాక్‌లో సీపెక్ ప్రాజెక్టుల ద్వారా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. కానీ ఇప్పుడు పాక్ అమెరికాతో దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తే, అది చైనాకు నచ్చకపోవచ్చు. పశ్చిమాసియా శాంతి ఒప్పందంలో పాక్ పాత్ర వల్ల అమెరికా నుంచి మరింత మద్దతు, ఆర్థిక సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా. ముఖ్యంగా ఐఎంఎఫ్‌ నుంచి రావాల్సిన 1.2 బిలియన్ డాలర్ల రుణం విషయంలో కూడా ఈ డిప్లమాటిక్ యాక్టివిటీ ప్రభావం చూపొచ్చు. కానీ ఇదే సమయంలో చైనా తన పెట్టుబడుల భద్రతపై ఆందోళన చెందే అవకాశముంది. పాకిస్థాన్‌కు చైనా ఇప్పటివరకు 60 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే సహాయం తక్కువే. ఈ నేపథ్యంలో పాక్ రెండు వైపులా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజకీయ ఆర్థిక అస్థిరత్వం

పాకిస్తాన్‌లో రాజకీయ స్థిరత్వం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ రాజకీయ అస్థిరత్వం వలన ఆర్థికలోటు పెరుగుతోంది. ఈ కారణంగా విదేశీ రుణభారం కూడా భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా ఒప్పందాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని పాక్ ప్రయత్నిస్తోంది. కానీ దీన్ని ఎంతవరకు సమర్థంగా ఉపయోగించుకుంటుందన్నదే కీలకం. అయితే, వీటితో సామాన్యులకు పెద్దగా ఒరిగేది ఉండదని నిపుణుల అంచనా. ఈ డిప్లమాటిక్‌ గేమ్‌ వలన దేశంలో ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు పెరుగుతాయా? ఇబ్బందులు లేకుండా, బాంబుల మోతలు లేకుండా ప్రశాంతంగా ఉంటామా అన్నదే సామాన్యులు చూస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే, ఈ ఒప్పందం తక్షణ ప్రయోజనం కంటే కూడా దీర్ఘకాలిక రాజకీయ లాభాల కోసమే ఎక్కువ ఉపయోగపడేలా కనిపిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే, పశ్చిమాసియా శాంతి ఒప్పందం పాకిస్తాన్‌కు ఒక అవకాశం అయినా, అదే సమయంలో ఓ సవాలు కూడా. అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే చైనాతో ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించగలిగితే పాక్‌ భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. లేదంటే ఆ దేశం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారొచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story