Pakistan Army Chief: పాకిస్తాన్ మరో కీలక నిర్ణయం....ఆర్మీచీఫ్‌కు రాజ్యాంగానికి మించి అధికారాలు
పాకిస్తాన్‌లో కొత్త రక్షణ చట్టంతో ఆర్మీ చీఫ్‌కు త్రివిధ దళాలపై విస్తృత అధికారాలు దక్కాయి. ఈ మార్పుతో సైనిక, రాజకీయ వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో తెలుసుకుందాం.
Pakistan Army Chief: పాకిస్తాన్ పార్లమెంట్ ఇటీవల ఆ దేశ సైనిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. 'డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ పాకిస్తాన్ యాక్ట్, 2026' ద్వారా త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లను ఒకే గొడుగు కిందకు తెస్తూ 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్' అనే నూతన శక్తివంతమైన పదవిని సృష్టించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ప్రస్తుత ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్ మొదటి సిడిఎఫ్ గా బాధ్యతలు చేపట్టి, సైన్యంలోని అన్ని విభాగాలపై పూర్తి చట్టబద్ధమైన, కార్యాచరణ రహిత అధికారాలను సాధించారు. 1976 తర్వాత పాకిస్తాన్ సైనిక నిర్మాణంలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పుగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన అంశాలు, తలెత్తుతున్న ఆందోళనల గురించి తెలుసుకుందాం.
పాత వ్యవస్థకు, కొత్త పదవికి తేడా ఏమిటి?
గతంలో పాకిస్తాన్‌లో 'చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ' ఉండేది. కానీ ఆ పదవికి కేవలం మూడు విభాగాల మధ్య సమన్వయం పరిమితమై ఉండేది తప్ప నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లపై నేరుగా ఆదేశాలు ఇచ్చే అధికారం ఉండేది కాదు. అయితే, ఈ కొత్త సిడిఎఫ్ పదవితో అసిమ్ మునీర్ ఇప్పుడు నేరుగా ఫెడరల్ ప్రభుత్వానికి నివేదిస్తూ, త్రివిధ దళాలకు సంబంధించిన ఆపరేషనల్ నిర్ణయాలను ఏకపక్షంగా అమలు చేయగలరు. ఈ చట్టం ద్వారా దేశ అణు వ్యూహాత్మక దళాల కమాండ్ కేవలం ఆర్మీ అధికారులకే దక్కేలా స్పష్టమైన నియమాన్ని తెచ్చారు.
మిలిటరీ చేతుల్లోకి మరింత అధికారం?
ఈ మార్పుతో పాకిస్తాన్ సమాజంలో, సైనిక విభాగాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల అధికారుల కెరీర్, పదోన్నతుల నిర్ణయాలు కూడా ఇప్పుడు ఆర్మీ నేతృత్వంలోని కమాండ్ చేతుల్లోకి వెళ్లడం వల్ల ఆయా విభాగాలు ప్రాధాన్యత కోల్పోతాయని మాజీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, చట్టపరంగా ఒక లేఖ ద్వారా అధికారులను తొలగించే అధికారం సిడిఎఫ్‌కు దక్కడంతో, సైన్యంపై పౌర ప్రభుత్వాల పర్యవేక్షణ మరింత బలహీనపడుతుందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్న సమర్థన
బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న వ్యవస్థలనే తాము అనుసరించామని పాకిస్తాన్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ద సమయాల్లో భూమి, ఆకాశం, సముద్రం, సైబర్, డ్రోన్ ఆపరేషన్లను వేగంగా సమన్వయం చేయడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, సంక్షోభ సమయంలో సుదీర్ఘ చర్చలు లేకుండా తక్షణమే నిర్ణయాలు తీసుకోవడానికి ఒకే కమాండర్ ఉండటం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కానీ, సామాన్య ప్రజలు మాత్రం అధికారాలు క్రమంగా ఆర్మీచేతుల్లోకి వెళ్తున్నాయని, తద్వారా తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.




