Pak Iran Trade Corridor : ప్రపంచ దేశాలకు మైండ్ బ్లాక్.. ఇరాన్ - పాక్ దోస్తీ వెనుక అమెరికా మాస్టర్ ప్లాన్ ఉందా?

Pak Iran Trade Corridor : పాకిస్థాన్ ఇరాన్ మధ్య వాణిజ్య కారిడార్‌కు అనుమతి ఇచ్చింది. ట్రాన్సిట్ ఆఫ్ గుడ్స్ ఆర్డర్ 2026 ద్వారా గ్వాదర్, కరాచీ నుంచి సరుకుల రవాణా మొదలుకానుంది.

CR Reddy
Published on: 27 April 2026 8:05 AM IST
Pak Iran Trade Corridor
X

Pak Iran Trade Corridor 

Pak Iran Trade Corridor : దక్షిణాసియా రాజకీయాల్లో, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన భౌగోళిక స్థానాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే దిశగా అడుగులు వేసింది. ఇరాన్ మీదుగా అంతర్జాతీయ వాణిజ్య కారిడార్‌ను ప్రారంభించేందుకు పాక్ ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ ఆర్డర్ 2026 పేరుతో విడుదలైన ఈ ఉత్తర్వుల వెనుక అమెరికా ప్రమేయం ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఏమిటీ ట్రాన్సిట్ ఆఫ్ గుడ్స్ ఆర్డర్ 2026?

పాకిస్థాన్ ప్రభుత్వం ఏప్రిల్ 2026లో అత్యంత కీలకమైన ట్రాన్సిట్ ఆఫ్ గుడ్స్ ఆర్డర్ 2026ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం గ్వాదర్, కరాచీ, తాఫ్తాన్ మార్గాల ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చే సరుకులు పాకిస్థాన్ భూభాగం మీదుగా ఇరాన్‌కు చేరుకోవచ్చు. గతంలో ఈ మార్గాలపై ఉన్న ఆంక్షలను పాక్ ఎత్తివేసింది. దీనివల్ల మధ్య ఆసియా దేశాలకు, పశ్చిమ ఆసియాకు మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. పాకిస్థాన్‌ను ఒక అంతర్జాతీయ ట్రాన్సిట్ హబ్‎గా మార్చాలనేది పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.

అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

సాధారణంగా ఇరాన్‌పై అమెరికా అనేక ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం అమెరికా నుంచి మౌఖికంగా లేదా రహస్యంగా అనుమతి వచ్చిన తర్వాతే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించాలని వాషింగ్టన్ భావిస్తుండవచ్చు. అయితే ఇప్పటివరకు అమెరికా నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పాకిస్థాన్ ఈ కారిడార్ ద్వారా పొందే ఆదాయం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని కొంతైనా మెరుగుపరుస్తుందని అంచనా.

గ్లోబల్ మెగా డీల్ - ఇతర దేశాల ప్రమేయం

ఈ వాణిజ్య కారిడార్ కేవలం పాక్ - ఇరాన్ మధ్యే పరిమితం కాబోదు. రాబోయే రోజుల్లో ఇది ఒక మెగా గ్లోబల్ డీల్‎గా మారే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో చైనా, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు కూడా భాగస్వాములు కానున్నాయని సమాచారం. ముఖ్యంగా చైనాకు చెందిన CPEC ప్రాజెక్టుకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. రష్యా కూడా ఇరాన్ మీదుగా దక్షిణాసియాకు తన సరుకులను పంపేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. సౌదీ - ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ కారిడార్ ఆసియా దేశాల మధ్య కొత్త బంధానికి వేదిక కానుంది.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వం - శాంతి దిశగా అడుగులు

గత 48 గంటల్లో పాకిస్థాన్ దౌత్యపరంగా చాలా చురుగ్గా వ్యవహరించింది. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరాన్ని తగ్గించడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా డీల్ గనుక కార్యరూపం దాల్చితే కేవలం వాణిజ్యం మాత్రమే కాకుండా ఇంధనం, భద్రత, శాంతి స్థాపనలో కూడా పెను మార్పులు వస్తాయి. ఒకవేళ ఇరాన్ చమురు, సహజ వాయువు ఈ కారిడార్ ద్వారా సరఫరా అయితే, అది ఆసియా దేశాల ఇంధన అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story