North Korea: ఆసియాలో మరోకొత్త టెన్షన్‌... నార్త్‌ కొరియా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

నార్త్‌ కొరియా, జపాన్‌ మధ్య ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొన్నది. జపాన్‌ ప్రయోగించిన టోమహాక్‌ క్షిపణే ఈ పరిస్థితికి కారణంగా అంచనావేస్తున్నారు.

Balachander
Published on: 5 Aug 2026 10:03 AM IST
North Korea: ఆసియాలో మరోకొత్త టెన్షన్‌... నార్త్‌ కొరియా స్ట్రాంగ్‌ వార్నింగ్‌
X

North Korea: ఆసియాలో పెరుగుతున్న టెన్షన్‌... జపాన్‌లో అమెరికా టోమహాక్‌ క్షిపణుల పరీక్షలు... ఆగ్రహం వ్యక్తం చేసిన నార్త్‌ కొరియా. జపాన్‌ చర్యలకు ప్రతిగా సైనిక చర్యలు చేపడతామని నార్త్‌ కొరియా అధికారిక మీడియా వెల్లడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తూర్పు ఆసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. జపాన్ తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ తీసుకుంటున్న ఈ సైనిక నిర్ణయాలకు ప్రతిగా తాము కూడాఅదనపు సైనిక చర్యలను ఎంచుకుంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, వర్కర్స్ పార్టీ కీలక నేత కిమ్ యో జోంగ్ ఆగస్టు 5న కీలక ప్రకటన విడుదల చేశారు.

క్షపణి పరీక్షే వివాదానికి కారణం

జపాన్‌కు చెందిన ఎగిస్ డిస్ట్రాయర్ చొకాయ్ అనే నౌక నుంచి అమెరికా తయారీ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. దీనికి తోడు జపాన్ ఇటీవల విడుదల చేసిన వార్షిక డిఫెన్స్ వైట్ పేపర్‌లో ఉత్తర కొరియా, చైనా, రష్యాలను ప్రధాన ముప్పులుగా పేర్కొంటూ, తన రక్షణ వ్యయాన్ని పెంచుకుంటామని తెలిపింది. జపాన్ తన పాత ఆత్మరక్షణ విధానాన్ని పక్కనపెట్టి, ఇతర దేశాలపై దాడులు చేసే స్థాయికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తోందని కిమ్ యో జోంగ్ ఆరోపించారు. జపాన్ చర్యల వెనుక పూర్తిగా అమెరికా హస్తం ఉందని ఉత్తర కొరియా మండిపడింది. టోమాహాక్ క్షిపణులను అందించడమే కాకుండా, మే నెలలో ఫిలిప్పీన్స్‌లో జరిగిన అమెరికా నేతృత్వంలోని సంయుక్త సైనిక విన్యాసాల్లో జపాన్‌ను భాగస్వామిని చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కిమ్‌ యో జోంగ్‌ చేసిన ఈ ప్రకటన తూర్పు ఆసియాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ప్రాంతీయ భద్రతకు ముప్పు

ఉత్తర కొరియాతో పాటు సమీప పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకునేందుకే జపాన్ దూరశ్రేణి క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకుంటోందని కిమ్ యో జోంగ్ పేర్కొన్నారు. జపాన్ తీసుకుంటున్న ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల దాని సొంత భద్రతే తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆమె హెచ్చరించారు. అంతేకాకుండా, జపాన్ తన మిలిటరీ విస్తరణ నిర్ణయానికి తీవ్రంగా పశ్చాత్తాపపడేలా తమ చర్యలు ఉంటాయని కిమ్ యో జోంగ్ ఘాటుగా స్పష్టం చేశారు. అమెరికా మద్దతుతో జపాన్ వేస్తున్న అడుగులు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కొత్త రకం ఆయుధ పోటీకి దారితీస్తున్నాయని, ఇది భవిష్యత్తులో పెద్ద సైనిక సంఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వీయ రక్షణ అవసరమే కాని ఇతర దేశాలకు ముప్పు తెచ్చే విధంగా ఆయుధాల సేకరణ జరగకూడదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యుద్ధాలతో ఆసియా యూరప్‌ ఖండాలు ఇబ్బందులు పడుతున్నాయి. జపాన్‌ పరిణామంతో తూర్పు ఆసియాలో కూడా యుద్ధమేఘాలు కమ్ముకుంటే దాని వలన ప్రపంచం ఇబ్బందులు పడక తప్పదని చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story