North Korea Elections: ఉత్తర కొరియా ఎన్నికలలో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ ఘన విజయం
North Korea Elections: ఉత్తర కొరియా ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ అఖండ విజయం. 1957 తర్వాత తొలిసారి వ్యతిరేక ఓటు నమోదు. కిమ్ యో-జోంగ్ గెలుపు,
North Korea Elections
North Korea Elections: ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికలలో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ విజయం సాధించింది. మార్చి 15న జరిగిన ఎన్నికలలో కొరియా వర్కర్స్ పార్టీ, దాని మిత్రపక్షాలు 99.93% ఓట్లను పొంది అన్ని స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఓటింగ్ శాతం 99.99%గా నమోదైందని అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి 687 మంది డిప్యూటీలు ఎన్నికయ్యారు. కేవలం 0.07% మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. కొత్త పార్లమెంటు మొదటి సమావేశం త్వరలో ప్యాంగ్‌యాంగ్‌లో జరగనుంది, అక్కడ దేశ అత్యున్నత నాయకత్వాన్ని ఎన్నుకోవడంతో పాటు రాజ్యాంగ సవరణలపై కూడా చర్చిస్తారు. దక్షిణ కొరియాను శత్రు దేశంగా పేర్కొనే నిబంధనను రాజ్యాంగంలో చేర్చే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ సర్వోన్నత నాయకుడిగా తిరిగి ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో 70 శాతానికి పైగా చట్టసభ సభ్యులను మార్చారు. దీనిని కిమ్ జోంగ్ ఉన్ తన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకునే వ్యూహంగా పరిగణిస్తున్నారు.
కొత్తగా కిమ్ యో-జోంగ్, విదేశాంగ మంత్రి చోయ్ సోన్-హుయ్, సన్నిహితుడు జో యోంగ్-వోన్‌లను చేర్చగా, మాజీ స్పీకర్ చోయ్ ర్యోంగ్-హేను తొలగించారు. ఉత్తర కొరియా పార్లమెంటు ఎన్నికలు.. అధికార మార్పిడి.. నిర్ణయాలు కేవలం లాంఛన ప్రాయంగానే ఉంటాయని ప్రపంచమంతా నమ్ముతుంది.
1957 తర్వాత తొలిసారి వ్యతిరేక ఓటు..
డిపిఆర్‌కె ఎన్నికల చట్టాల ప్రకారం, కార్మికులు, రైతులు, మేధావులు, సైనిక సిబ్బంది, అధికారులు సహా 687 మంది ప్రతినిధులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతి నియోజకవర్గానికి ఒకే అభ్యర్థిని జాబితాలో చేర్చడంతో, బయటి పరిశీలకులు ఈ ప్రక్రియను విమర్శిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో చెప్పుకోవలసింది వ్యతిరేక ఓటు. 1957 తర్వాత సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారిగా వ్యతిరేక ఓట్లు పడినట్లు ప్రభుత్వ మీడియా అంగీకరించింది.
అలాగే, ఎన్నికైన వారిలో కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఉన్నారు. ఆమె కల్లిమ్‌గిల్ నియోజకవర్గం నెం. 5లో గెలుపొందారు.
సోషల్ మీడియాలో సెటైర్లు
ఉత్తర కొరియాలో ఇలాంటి అఖండ విజయాలు సాధారణమే అయినప్పటికీ, ఆ 0.07% వ్యతిరేక ఓట్లు ఆన్‌లైన్‌లో త్వరగా అందరి దృష్టిని ఆకర్షించాయి. సోషల్ మీడియా వినియోగదారులు ఈ విషయంపై సెటైర్స్ వేస్తున్నారు.
ఒక నెటిజన్ “ఆ 0.07% కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం” అని రాశారు. మరొకరు కిమ్ ఫోటో పోస్ట్ చేస్తూ, “ఆ 0.07% మంది పేర్లు చెప్పండి” అని సెటైర్ వేసహ్రు.
ఇక మరో నెటిజన్ అయితే “సంబంధం లేని వార్త ఏమిటంటే, ఈ వేసవిలో జనాభా 0.07% తగ్గుతుందని అంచనా” అంటూ వ్యతిరేక ఓటు వేసిన వారి భవిష్యత్ ను ఊహించారు.
"ఆ 0.07% మంది ఇప్పుడే దేశంలో అత్యంత కావలసిన వ్యక్తులుగా మారారు," అని Xలో మరో యూజర్ పేర్కొన్నారు.




