Nirmal Purja : పర్వతారోహణ దిగ్గజం నిర్మల్ పుర్జా కన్నుమూత.. పాకిస్థాన్‌లో మంచు తుఫానుకు బలి.!
Nirmal Purja : ప్రపంచ ప్రఖ్యాత నేపాల్ పర్వతారోహకుడు నిర్మల్ "నిమ్స్‌దాయి" పుర్జా (43) ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని కారాకోరమ్ శ్రేణిలో ఉన్న
Nirmal Purja
Nirmal Purja : ప్రపంచ ప్రఖ్యాత నేపాల్ పర్వతారోహకుడు నిర్మల్ "నిమ్స్‌దాయి" పుర్జా (43) ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని కారాకోరమ్ శ్రేణిలో ఉన్న 'బ్రాడ్ పీక్' పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో సంభవించిన భారీ మంచు తుఫాను కారణంతో ఆయన మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించబడింది. నిర్మల్ పుర్జా వ్యవస్థాపక భాగస్వామిగా ఉన్న 'ఎలైట్ ఎక్స్‌పెడిషన్' సంస్థ ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ప్రమాదం ఎలా జరిగింది.?
గురువారం మధ్యాహ్నం బ్రాడ్ పీక్ పర్వతారోహణకు 10 మంది సభ్యుల బృందంతో నేతృత్వం వహిస్తున్న సమయంలో ఈ మంచు తుఫాను విరుచుకుపడింది. ఈ బృందంలో నేపాల్‌కు చెందిన ఆరుగురు పర్వతారోహకులతో పాటు పాకిస్థాన్, ఒమన్, అమెరికా , చైనా దేశాలకు చెందిన ఒక్కో సభ్యుడు ఉన్నారు. తుఫాను ధాటికి బృందంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో, వారిని కాపాడేందుకు పాకిస్థాన్ ఆల్పైన్ క్లబ్ హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఘనంగా నివాళులు అర్పించిన ప్రపంచం
నిర్మల్ పుర్జా మృతి పట్ల ఎలైట్ ఎక్స్‌పెడిషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయనను పర్వతారోహణ రంగంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా అభివర్ణించింది. నేపాల్ ప్రధాని బలేన్ షా సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తూ, "పర్వతారోహణ అనేది కేవలం శిఖరాలను చేరుకోవడం మాత్రమే కాదు.. అది ధైర్యం, క్రమశిక్షణ , మానవ పరిమితులను అధిగమించే త్యాగానికి ప్రతీక. పర్వతాలు ఎంతోమందికి శిఖరాగ్ర కీర్తిని ఇస్తాయి, కానీ కొన్నిసార్లు వారిని శాశ్వతంగా తమలో ఐక్యం చేసుకుంటాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మల్ పుర్జా ఎవరు? ఆయన సాధించిన రికార్డులు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మల్ పుర్జా, 2019లో ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎత్తైన 14 ప్రధాన శిఖరాలను కేవలం 6 నెలల 6 రోజుల్లో అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. గతంలో దక్షిణ కొరియా పర్వతారోహకుడు కిమ్ చాంగ్-హో ఏడేళ్లలో సాధించిన రికార్డును ఆయన బద్దలు కొట్టారు. ఈ అద్భుత ఘనత ఆధారంగానే నెట్‌ఫ్లిక్స్‌లో '14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్' అనే ప్రసిద్ధ డాక్యుమెంటరీ కూడా వచ్చింది.
పర్వతారోహకుడిగా మారకముందు పుర్జా బ్రిటీష్ మిలిటరీలోని గూర్ఖా బ్రిగేడ్ , రాయల్ నేవీకి చెందిన ఎలైట్ స్పెషల్ బోట్ సర్వీస్ (SBS)లో 16 ఏళ్ల పాటు సేవలు అందించారు. సైనిక సేవలకు గాను 2018లో ఆయనకు బ్రిటన్ ప్రభుత్వం 'ఎమ్బీఈ' (MBE) పురస్కారాన్ని అందజేసింది.
సవాలుతో కూడుకున్న 'బ్రాడ్ పీక్'
పాకిస్థాన్-చైనా సరిహద్దుల్లో, కే2 పర్వతం సమీపంలో ఉన్న 'బ్రాడ్ పీక్' ఎత్తు 8,051 మీటర్లు. ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తైన ఈ పర్వతం అధిరోహణకు అత్యంత ప్రమాదకరమైనదిగా పేరుగాంచింది. 1957 జూన్‌లో ఆస్ట్రియన్ బృందం మొదటిసారిగా ఈ శిఖరాన్ని అధిరోహించగా, నాటి నుండి నేటివరకు అనేకమంది పర్వతారోహకులకు ఇది సవాలుగా నిలుస్తోంది. నేపాల్ పర్వత సమూహాలకు మద్దతుగా 'నిమ్స్‌దాయి ఫౌండేషన్' ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిన పుర్జా భౌతికంగా దూరమైనా, ఆయన ధైర్యసాహసాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.




