Israel Iran War : ఇది జస్ట్ టీ బ్రేక్.. అసలు సినిమా ముందుంది.. నెతన్యాహు వార్నింగ్‌తో వణికిపోతున్న ఇరాన్
Israel Iran War : ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ తాత్కాలికమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అణు ఆయుధాల ముప్పును తొలగించే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.
Israel Iran War
Israel Iran War : ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు తాజా ప్రకటనతో పశ్చిమాసియాలో ఉత్కంఠ మళ్లీ తారాస్థాయికి చేరింది. ఇరాన్‌తో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ కేవలం ఒక విరామం మాత్రమేనని, యుద్ధం ముగిసిందని ఎవరూ అనుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ విశ్రమించదని ఆయన శపథం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఒక కీలక ఒప్పందం కుదిరింది. అమెరికా జోక్యంతో రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే, దీనిపై నెతన్యాహు ఘాటుగా స్పందించారు. "మేము ఇరాన్‌పై ఆపరేషన్ గిడియాన్ స్వోర్డ్, ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభించకపోయి ఉంటే, ఇరాన్ ఎప్పుడో అణు ఆయుధాలు తయారుచేసి ఇజ్రాయెల్‌ను నాశనం చేసేది. ఇప్పుడు జరిగిన ఒప్పందం కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమే. మా అంతిమ లక్ష్యం ఇరాన్ నుంచి యురేనియంను పూర్తిగా తొలగించడం" అని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఇరాన్ నుంచి అణు పదార్థాలను బయటకు తరలించే విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒకే మాట మీద ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఒప్పందం ద్వారా సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారానైనా ఈ పని చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి నెతన్యాహు ఈ సీజ్‌ఫైర్‌కు ఒప్పుకున్నారని ఇజ్రాయెల్ విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి సమాధానంగా, "అమెరికన్లు మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు, మా అంగీకారంతోనే ఇది జరిగింది. కానీ మా వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్ మీదనే ఉంటాయి. ఏ క్షణమైనా యుద్ధ క్షేత్రంలోకి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఆయన గట్టిగా చెప్పారు.
ఇరాన్‌తో సీజ్‌ఫైర్ కుదిరినప్పటికీ, లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపుపై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం బెయిరూట్‌లో హిజ్బుల్లాకు చెందిన 100కు పైగా స్థావరాలపై ఇజ్రాయెల్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీనిని ఆపరేషన్ ఎటర్నల్ డార్క్‌నెస్ గా పేర్కొంటున్నారు. కేవలం పది నిమిషాల వ్యవధిలో వందలాది బాంబులు వేయడంతో హిజ్బుల్లా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులను నాశనం చేయడమే కాకుండా, కొత్త క్షిపణులను తయారు చేసే వారి ఫ్యాక్టరీలను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని నెతన్యాహు క్లెయిమ్ చేశారు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర కేవలం స్టాక్‌లో ఉన్న మిసైళ్లు మాత్రమే ఉన్నాయని, వారి తయారీ వ్యవస్థను తాము కూల్చివేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు వారాల విరామం తర్వాత యుద్ధం మరెంత తీవ్రరూపం దాల్చుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


