Mystery Silver Balls: ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టరీ బాల్స్... పెరుగుతున్న ఉత్కంఠత
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ బీచ్‌లో బయటపడిన రహస్య వెండి గోళాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవి అంతరిక్ష రాకెట్ శకలాలా? కాదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
Mystery Silver Balls: ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సముద్ర తీరంలో ఒక్కసారిగా ప్రత్యక్షమైన కొన్ని భారీ వెండి రంగు గోళాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఆకాశం నుండి ఊడిపడ్డాయా లేదా సముద్ర గర్భం నుండి కొట్టుకొచ్చాయా అనే గందరగోళం నడుమ.. ఇవి రాకెట్ ప్రయోగాల తర్వాత మిగిలిపోయే అంతరిక్ష శకలాలు కావచ్చునని నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూలై 5, ఆదివారం నాడు క్వీన్స్లాండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర క్వీన్స్లాండ్ తీరప్రాంతంలో మొత్తం 6 రహస్య గోళాకార వస్తువులను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఈ వస్తువుల అసలు మూలాలను కనిపెట్టే పనిలో పడింది.
హైడ్రజైన్ ముప్పు ... 50 మీటర్ల నో-గో జోన్!
ఈ వింత వస్తువులు కేవలం ఇనుప ముక్కలు కావు, వీటితో ప్రాణాపాయం పొంచి ఉందనే హెచ్చరికలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ సిల్వర్ బాల్స్‌లో రాకెట్లలో ఇంధనంగా వాడే అత్యంత ప్రమాదకరమైన, క్యాన్సర్ కారక రసాయనం 'హైడ్రజైన్' ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. కనుగొనబడిన ఆరు వస్తువులలో ఐదు గోళాలను రసాయన నిపుణులు సురక్షితంగా ప్రత్యేక డ్రమ్ములలో భద్రపరిచారు. ఆరో వస్తువును నిర్వీర్యం చేసే ప్రక్రియ సాగుతోంది. ఈ శకలాలు లభించిన బీచ్ పరిసరాల్లో 50 మీటర్ల పరిధిని 'ఎక్స్‌క్లూజన్ జోన్'గా ప్రకటించి ఎవరినీ రానివ్వడం లేదు. ప్రజలు పొరపాటున కూడా వీటిని తాకవద్దని, ఇలాంటివి కనిపిస్తే వెంటనే 'ట్రిపుల్ జీరో' నంబరుకు ఫోన్ చేయాలని అత్యవసర విభాగం హెచ్చరించింది.
స్పేస్ ఆర్కియాలజిస్ట్ విశ్లేషణ
ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన స్పేస్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అలీస్ గోర్మన్ 'ది గార్డియన్' పత్రికతో మాట్లాడుతూ.. ఈ గోళాలపై ఎలాంటి మసి లేదా కాలిపోయిన గుర్తులు లేవని, దీన్ని బట్టి ఇవి రాకెట్ భూమి నుండి నింగిలోకి వెళ్లేటప్పుడు విడిపోయే మొదటి లేదా రెండో దశకు చెందిన భాగాలు కావచ్చునని అభిప్రాయపడ్డారు. గతంలో అనగా 2023లో కూడా ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో భారత్‌కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కి సంబంధించిన ఒక మెటల్ డోమ్ కొట్టుకువచ్చిన సంఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మళ్లీ ఇప్పుడు క్వీన్స్లాండ్ బీచ్‌లో ఒకేసారి ఆరు అంతరిక్ష గోళాలు బయటపడటం, అంతరిక్ష వ్యర్థాల నిర్వహణలో అంతర్జాతీయ నియమ నిబంధనల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు భరోసా ఇచ్చినప్పటికీ, ఈ అంతరిక్ష శకలాలు ఏ దేశానికి చెందిన రాకెట్ ముక్కలనేది తేలాల్సి ఉంది.




