Iran Israel Conflict : శవాల దిబ్బగా మారుతున్న ఇరాన్, లెబనాన్.. ఈ యుద్ధం భూగోళాన్ని బూడిద చేయనుందా?

Iran Israel Conflict : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో మిడిల్ ఈస్ట్‌లో ఇప్పటివరకు 3,400 మందికి పైగా మరణించారు. మరణించిన వారిలో వందలాది మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ ప్రాంతాల్లో రక్తపాతం కొనసాగుతోంది.

CR Reddy
Published on: 30 March 2026 9:32 AM IST
Iran Israel Conflict
X

Iran Israel Conflict 

Iran Israel Conflict : మిడిల్ ఈస్ట్‌లో శాంతి అనేది ఇప్పుడు ఒక కలగా మారిపోయింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేయడంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మొత్తం ప్రాంతాన్ని దహించివేస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలతో పాటు పలు గల్ఫ్ దేశాలపై క్షిపణి వర్షం కురిపిస్తోంది. అటు లెబనాన్ సరిహద్దుల్లో కూడా కొత్త పోరాట రంగం మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ యుద్ధంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా ధృవీకరించకపోయినా, వివిధ అంతర్జాతీయ సంస్థలు షాకింగ్ గణాంకాలను బయటపెడుతున్నాయి.

అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ HRANA నివేదిక ప్రకారం, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 3,461 మంది మరణించారు. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, మరణించిన వారిలో 1,551 మంది సామాన్య పౌరులే. యుద్ధంతో ఏ సంబంధం లేని 236 మంది చిన్నారులు కూడా ఈ మంటల్లో కాలిబూడిదయ్యారు. ఆసుపత్రులు, స్థానిక నివేదికలు, పౌర సమాజ నెట్‌వర్క్‌ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంకెలు వెల్లడయ్యాయి. బాంబుల మోతతో నగరాలకు నగరాలే శవాల దిబ్బలుగా మారుతున్నాయి.

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సమాచారం ప్రకారం.. ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,900 మంది చనిపోయారు. మరో 20 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మార్చి 4న శ్రీలంక తీరంలో ఒక ఇరాన్ యుద్ధనౌకపై జరిగిన దాడిలో 104 మంది సైనికులు మరణించినట్లు ఇరాన్ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. ఇక లెబనాన్ విషయానికి వస్తే, మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,238 మంది మరణించారు. వీరిలో 124 మంది చిన్నపిల్లలు ఉన్నారు. హిజ్బుల్లా గ్రూపుకు చెందిన 400 మందికి పైగా పోరాట యోధులు కూడా ఈ పోరులో హతమైనట్లు తెలుస్తోంది.

ఈ యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా దెబ్బతింటోంది. ఇరాక్ అధికారుల సమాచారం ప్రకారం.. అక్కడ కూడా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో అటు అమెరికా మిత్రపక్షాలైన కుర్దిష్ పోరాట యోధులు, ఇటు ఇరాన్ అనుకూల షియా గ్రూపుల సభ్యులు కూడా ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో ఈ యుద్ధం మరింత ముదురుతోందని, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఆకాశంలో బాంబులు, నేలపై రక్తపుటేరులతో మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక నరకప్రాయంగా మారింది.

CR Reddy

CR Reddy

Next Story