Kim Jong Un : కిమ్‎కి కోపం వస్తే అంతే.. బటన్ నొక్కాడంటే క్షిపణి సముద్రంలో పడాల్సిందే

Kim Jong Un : ఉత్తర కొరియా జపాన్ సముద్రం లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాల నేపథ్యంలో కిమ్ జంగ్ ఉన్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఆసియాలో ఉద్రిక్తతలను పెంచింది.

CR Reddy
Published on: 14 March 2026 11:53 AM IST
Kim Jong Un
X

Kim Jong Un

Kim Jong Un : ప్రపంచం ఇప్పుడు మరో పెను ప్రమాదం అంచున నిలబడింది. ఒకవైపు మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం భీకర రూపం దాల్చగా.. ఇప్పుడు ఆసియాలోని మరో మూల యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉత్తర కొరియా నియంత కిమ్ జంగ్ ఉన్ మరోసారి క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోయారు. జపాన్ సముద్రం లక్ష్యంగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఈ పరిణామంతో అటు జపాన్, ఇటు దక్షిణ కొరియా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ క్షిపణి ప్రయోగాన్ని ధృవీకరిస్తూ, అది అప్పటికే సముద్రంలో పడిపోయి ఉండవచ్చని అంచనా వేసింది.

అసలే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల అమెరికా తన దృష్టిని అటు వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాలో ఉన్న తన శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను అమెరికా అక్కడి నుంచి తొలగించి పశ్చిమ ఆసియాకు తరలించింది. సరిగ్గా ఇదే అదనుగా భావించిన ఉత్తర కొరియా తన పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. దక్షిణ కొరియా వద్ద రక్షణ కవచం బలహీనపడిన ఈ సమయంలో కిమ్ గనుక విరుచుకుపడితే, ఆ ప్రాంతంలో ఊహించని వినాశనం తప్పదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలే ఉత్తర కొరియా ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. 11 రోజుల పాటు సాగే ఈ విన్యాసాలను ఉత్తర కొరియా తనపై దండయాత్రకు సన్నాహాలుగా భావిస్తోంది. ఈ క్రమంలోనే కిమ్ జంగ్ ఉన్ సోదరి కిమ్ యో-జంగ్ ఘాటుగా స్పందిస్తూ.. "ఊహించని రీతిలో భయంకరమైన పరిణామాలు ఉంటాయి" అంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. దీనికి తగ్గట్టుగానే కిమ్ జంగ్ ఉన్ స్వయంగా క్షిపణి పరీక్షలను పర్యవేక్షిస్తూ, అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకోవాలని తన సైన్యానికి పిలుపునిచ్చారు.

నిజానికి ఉత్తర కొరియా కేవలం బాలిస్టిక్ క్షిపణులే కాకుండా, వ్యూహాత్మక క్రూయిజ్ మిసైల్స్‌ను కూడా పరీక్షిస్తోంది. ఇటీవల చో హ్యోన్ డిస్ట్రాయర్ నౌక నుంచి క్షిపణులను ప్రయోగించి తన సముద్ర బలాన్ని చాటుకుంది. గత జనవరిలో కూడా కొత్త రకం మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను పరీక్షించిన కిమ్.. ఇప్పుడు ఏకంగా జపాన్ వైపు గురిపెట్టడం ఆసియాలో యుద్ధం ఖాయమనే సంకేతాలను ఇస్తోంది. ఒకవేళ ఇక్కడ గనుక యుద్ధం మొదలైతే, అది కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.

CR Reddy

CR Reddy

Next Story