North Korea: ఉత్తర కొరియా సరికొత్త వ్యూహం... ప్రపంచానికి తలనొప్పిగా మారనున్న కిమ్‌ ప్రణాళిక

అణ్వాయుధ సామర్థ్యంతో కూడిన నౌకాదళాన్ని నిర్మించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భారీ ప్రణాళికను ప్రకటించారు. కొత్త యుద్ధనౌకలు, అణు క్షిపణుల మోహరింపు కారణంగా కొరియా ద్వీపంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Balachander
Published on: 24 Jun 2026 11:04 AM IST
North Korea: ఉత్తర కొరియా సరికొత్త వ్యూహం... ప్రపంచానికి తలనొప్పిగా మారనున్న కిమ్‌ ప్రణాళిక
X

North Korea: అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఉత్తర కొరియా మరోసారి సంచలనానికి తెరలేపింది. దశాబ్దాలుగా క్షిపణులు, అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిన ఆ దేశం.. ఇప్పుడు తన వ్యూహాన్ని సముద్ర మార్గంలోకి మార్చింది. తమ నౌకాదళాన్ని అణ్వాయుధ శక్తితో బలోపేతం చేయడమే కాకుండా, భారీ యుద్ధనౌకల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. పశ్చిమ రేవు పట్టణమైన నాంపోలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో సరికొత్త డిస్ట్రాయర్‌ను నావికాదళంలోకి చేర్చుతూ కిమ్ ఈ సంచలన ప్రణాళికను ప్రపంచం ముందుంచారు.

యుద్ధనౌక ‘చోయ్ హ్యోన్’ ...ఐదేళ్ల భారీ ప్రణాళిక

ఉత్తర కొరియా చరిత్రలోనే అత్యంత భారీగా ఆయుధాలు అమర్చిన నౌకగా దీనిని వర్ణిస్తున్నారు. నావికాదళ ఆధునీకరణలో భాగంగా కిమ్ ప్రకటించిన కొన్ని కీలక లక్ష్యాలను ప్రకటించారు. తాజాగా నౌకాదళంలో చేరిన ‘చోయ్ హ్యోన్’ యుద్ధనౌక బరువు దాదాపు 5,000 టన్నులు. ఇది గతేడాది లాంచ్ అయినప్పటికీ, సుమారు 14 నెలల పాటు కఠినమైన సైనిక పరీక్షలను పూర్తి చేసుకుని ఇప్పుడు అధికారికంగా విధుల్లోకి చేరింది. రాబోయే ఐదేళ్ల రక్షణ ప్రణాళికలో భాగంగా.. చోయ్ హ్యోన్ తర్వాత ‘కాంగ్ కాన్’ అనే మరో డిస్ట్రాయర్‌ను రంగంలోకి దించనున్నారు. ఆ వెంటనే ఒక్కొక్కటి 10,000 టన్నుల బరువుండే భారీ క్రూయిజర్ యుద్ధనౌకలను వరసగా నిర్మిస్తామని కిమ్ ప్రకటించారు. ఐదేళ్ల రక్షణ ప్రణాళిక ప్రకారం ప్రతి సంవత్సరం చోయ్ హ్యోన్ స్థాయి లేదా అంతకంటే పెద్దవైన కనీసం రెండు యుద్ధనౌకలను తయారు చేయాలని కిమ్ లక్ష్యంగా నిర్దేశించారు.

బలహీనత నుండి ప్రపంచాన్ని భయపెట్టే శక్తిగా

ఉత్తర కొరియా మిలిటరీలో ఇప్పటివరకు నావికాదళం అత్యంత బలహీనమైనదిగా పరిగణించబడేది. కాగా, ఇప్పుడు కిమ్‌ సరికొత్త ప్రణాళికతో నౌకాదళాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాధారణ డిస్ట్రాయర్లు అయినప్పటికీ...వాటిలో భారీ ఆయుధాలను అమర్చడం, అణ్వాయుధాలను కూడా ప్రయోగించగలిగే విధంగా వీటిని తయారు చేస్తున్నారు. ఇది ప్రపంచానికి ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొరియా ద్వీపకల్పంలో అణుయుద్ధ మేఘాలు

అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా జరుపుతున్న సైనిక విన్యాసాలు కొరియా ద్వీపకల్పాన్ని "అణుయుద్ధం అంచున" నిలబెట్టాయని కిమ్ హెచ్చరించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టడానికి నౌకాదళానికి అణ్వాయుధాలు అప్పగించే కార్యక్రమం ఏమాత్రం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ నౌకలపై అణ్వాయుధాలు మోసుకెళ్లే వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను కూడా మోహరించనున్నారు. అంతర్జాతీయంగా ఎన్నో ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని సముద్ర గర్భంలోకి కూడా విస్తరిస్తుండటం అమెరికా మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఘర్షణ వస్తే, అమెరికా జోక్యాన్ని సముద్రంలోనే నిలువరించడానికి కిమ్ జోంగ్ ఉన్ పక్కా ప్లాన్‌తో వేస్తున్న అడుగులు సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా త్రివిధ దళాలను ఒక్కొక్కటిగా బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. నేలపై బలంగా ఉన్న కిమ్‌ ఆర్మీ...ఇప్పుడు సముద్రంలో దూకుడు పెంచుతోంది. రాబోయే రోజుల్లో గగనతలంలో కూడా తమదైన శైలిలో ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story