మృత్యుపాశం నుంచి తృటిలో తప్పించుకున్న రిపోర్టర్.. క్షిపణి దాడి దృశ్యాలు వైరల్!

దక్షిణ లెబనాన్‌లో యుద్ధ కవరేజీలో ఉన్న జర్నలిస్టులు మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చారు.

Arun Chilukuri
Published on: 20 March 2026 4:19 PM IST
మృత్యుపాశం నుంచి తృటిలో తప్పించుకున్న రిపోర్టర్.. క్షిపణి దాడి దృశ్యాలు వైరల్!
X

మృత్యుపాశం నుంచి తృటిలో తప్పించుకున్న రిపోర్టర్.. క్షిపణి దాడి దృశ్యాలు వైరల్!

దక్షిణ లెబనాన్‌లో యుద్ధ కవరేజీలో ఉన్న జర్నలిస్టులు మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చారు. రష్యాకు చెందిన 'రష్యా టుడే' (RT) ఛానెల్ రిపోర్టర్, కెమెరామెన్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో వారికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ క్షిపణి పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.

అసలేం జరిగింది?

దక్షిణ లెబనాన్‌లోని లిటాని నదిపై ఉన్న అల్-ఖస్మియా వంతెన వద్ద ఇజ్రాయెల్ దాడుల ప్రభావాన్ని ఆర్టీ కరస్పాండెంట్ స్టీవ్ స్వీనీ, కెమెరా ఆపరేటర్ అలీ రిదా స్బైటీ కవర్ చేస్తున్నారు. వారు జర్నలిస్టులని గుర్తించేలా 'PRESS' అని రాసి ఉన్న జాకెట్లు ధరించి ఉన్నప్పటికీ, ఒక్కసారిగా క్షిపణి వారి పక్కనే వచ్చి పడింది. ఈ దాడిలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

రష్యా ఆరోపణలు - ఇజ్రాయెల్ వివరణ:

ఇది ప్రమాదవశాత్తూ జరిగిన దాడి కాదని, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తోసిపుచ్చింది. ఆ వంతెనను హిజ్బుల్లా ఆయుధాల రవాణాకు వాడుతున్నందున దాడి చేశామని, పౌరులను లేదా జర్నలిస్టులను తాము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన 'జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ' (CPJ), దీనిపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేసింది. యుద్ధ క్షేత్రంలో జర్నలిస్టుల భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story