Japan: జపాన్‌ మాస్టర్‌ ప్లాన్.... టోక్యోకు ధీటుగా మరో రాజధాని డెవలప్‌మెంట్‌?

జపాన్‌లో వరస భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో రాజధాని టోక్యోలో భూకంపం సంభవిస్తే జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Balachander
Published on: 29 July 2026 11:36 AM IST
Japan: జపాన్‌ మాస్టర్‌ ప్లాన్.... టోక్యోకు ధీటుగా మరో రాజధాని డెవలప్‌మెంట్‌?
X

Japan: భూకంపాల ముప్పుతో నిత్యం వణికే జపాన్, దేశ పరిపాలన స్తంభించిపోకుండా ఉండేందుకు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాజధాని టోక్యోపై ఏదైనా ప్రకృతి విపత్తు విరుచుకుపడితే, సమాంతరంగా పాలన సాగించేందుకు ‘రెండవ రాజధాని’ ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే చారిత్రక బిల్లుకు జపాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రధాని సనాయే తకైచి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు జపాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రెండో రాజధాని అవసరం ఎందుకొచ్చింది?

జపాన్ ఆర్థిక వ్యవస్థ, జనాభా అంతా టోక్యో చుట్టూనే కేంద్రీకృతమై ఉండటమే దీనికి ప్రధాన కారణం. భూకంప శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన గణాంకాలను చూద్దాం. రాబోయే 30 ఏళ్లలో టోక్యో మహానగర ప్రాంతంలో 7.0 తీవ్రతతో కూడిన తీవ్రమైన భూకంపం సంభవించే అవకాశం 70% వరకు ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాకుండా, జపాన్ మొత్తం ఆర్థిక ఉత్పత్తిలో 20% ఒక్క టోక్యో నుంచే వస్తుంది. అంతేకాక నమోదిత కంపెనీలలో 50% పైగా కార్యాలయాలు, దేశ జనాభాలో 30% మంది ఇక్కడే నివసిస్తున్నారు. భూకంపం వస్తే ప్రధాని కార్యాలయం, పార్లమెంట్, ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒకేసారి కుదుపుకు గురవుతాయి. దీనిని నివారించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

రేసులో ఉన్న నగరాలు ... రాజకీయ వివాదం

ఈ చట్టం ప్రకారం ఏ నగరమైనా రెండవ రాజధాని హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేసులో నిలిచిన ప్రధాన ప్రాంతాలు ఏమిటో తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఒకాసా. ప్రధాని కూటమి భాగస్వామి అయిన 'జపాన్ ఇన్నోవేషన్ పార్టీ' బలంగా ఉన్న ఒసాకాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అదేవిధంగా.. టయోటా సంస్థ ప్రధాన కేంద్రమైన ఐచి ప్రిఫెక్చర్ తో పాటు పుకుఓకా, హక్కైడో, మియాగి ప్రాంతాలు కూడా రాజధాని రేసులో ముందుకొచ్చాయి.

సభలో గట్టెక్కిన బిల్లు ... తకైచికి రాజకీయ సవాలు

దిగువ సభలో స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల ఆధిక్యం ఉన్న ఎగువ సభలో ఈ బిల్లు కేవలం రెండు ఓట్ల తేడాతో అతికష్టమ్మీద నెగ్గింది. ఒసాకా నగరంపైనే ప్రభుత్వం ఎక్కువ నిధులు కుమ్మరిస్తోందన్న విమర్శలతో పాటు, ధరల పెరుగుదల వంటి తక్షణ ప్రజా సమస్యలను వదిలేసి ఇలాంటి వివాదాస్పద బిల్లులపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాని తకైచి ప్రజాదరణ తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో రాజధాని అవసరం ఉన్నప్పటికీ దానిపై కాకుండా ప్రధాన సమస్యలపై ఎక్కువ ఫోకస్‌ చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story