Israel Lebanon War : 24 గంటల్లో 50 వైమానిక దాడులు.. ఏడుగురు మృతి.. లెబనాన్‌ను వణికిస్తున్న ఇజ్రాయెల్

Israel Lebanon War : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ ఉన్నా 24 గంటల్లో 50 సార్లు వైమానిక దాడులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, కాన్వెంట్ భవనం ధ్వంసమైంది.

CR Reddy
Published on: 3 May 2026 9:28 AM IST
Israel Lebanon War
X

Israel Lebanon War

Israel Lebanon War : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కాగితాలకే పరిమితమవుతోంది. శాంతి నెలకొంటుందని భావిస్తున్న తరుణంలో, లెబనాన్‌పై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 50 వైమానిక దాడులతో లెబనాన్‌ను దడదడలాడించింది. ఈ దాడుల్లో అమాయక పౌరులతో పాటు హిజ్బుల్లా సభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఏప్రిల్ 17 నుంచి ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య మూడు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. శనివారం దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో కనీసం ఏడుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఎలా వావేయా దీనిపై స్పందిస్తూ, హిజ్బుల్లాకు చెందిన కీలక మౌలిక సదుపాయాలు, సభ్యులే లక్ష్యంగా గడిచిన 24 గంటల్లో 50 దాడులు నిర్వహించినట్లు ధృవీకరించారు.

లెబనాన్ అధికారిక వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. కఫర్ దజల్ గ్రామంలో ఒక కారుపై జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే లువైజేహ గ్రామంలోని ఒక నివాసంపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. మరో గ్రామంలో జరిగిన దాడిలో మరో ఇద్దరు బలయ్యారు. దాడికి ముందు తొమ్మిది దక్షిణ గ్రామాల ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

సరిహద్దు గ్రామం యారూన్‌లో ఒక కాథలిక్ కాన్వెంట్‌ను ఇజ్రాయెల్ సైన్యం బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ పాఠశాల, క్లినిక్ ఉన్న భవనం 2006 యుద్ధం నుంచి మూతపడి ఉంది. అయితే హిజ్బుల్లా సభ్యులు ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు వదులుతున్నారని IDF ఆరోపించింది. ఈ భవనంపై ఎలాంటి మతపరమైన చిహ్నాలు లేవని, అందుకే దీనిని హిజ్బుల్లా స్థావరంగా భావించి ధ్వంసం చేశామని సైన్యం స్పష్టం చేసింది. అయితే లెబనాన్ కాథలిక్ చర్చి ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

మున్ముందు ఏం జరగబోతోంది?

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినప్పటికీ, ఇరుపక్షాల మధ్య నమ్మకం అడుగంటింది. హిజ్బుల్లాను సమూలంగా తుడిచిపెట్టే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం సంకేతాలిస్తోంది. మరోవైపు లెబనాన్ ప్రజలు దాడులకు భయపడి భారీగా వలస వెళ్తున్నారు. అంతర్జాతీయ మధ్యవర్తులు శాంతి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మళ్ళీ లెబనాన్ గగనతలాన్ని కమ్మేస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story