Iran Powerful Weapons: ఇరాన్ అమ్ములపొదిలు ఐదు అస్త్రాలు...అమెరికాకు ముచ్చెమటలు
Iran Powerful Weapons: గత రెండు నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొంది.
Iran Powerful Weapons
Iran Powerful Weapons: గత రెండు నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇజ్రాయి్, అమెరికా దేశాలు అత్యాధునిక సాంకేతకతతో కూడిన ఆయుధాలను ఇరాన్‌పై ప్రయోగించినా.. ఇరాన్ ధీటుగా ఎదుర్కొంది. యుద్ధం ప్రారంభమైన తొలిరోజే ఇరాన్ తన అగ్రనాయకుడిని కోల్పోయినా... పట్టు విడువలేదు. చిన్న చిన్న ఆయుధాలు, బలమైన క్షిపణి వ్యవస్థతోనే పోరాటం చేస్తున్నది. తన మనుగడను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ పోరాటం వెనుక ముఖ్యంగా ఐదు ఆయుధాలు ఉన్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. వీటితోనే అమెరికాను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.
బాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ ప్రధాన బలం
ఇరాన్ అమ్ములపొదిలో అత్యంత భయంకరమైనవి బాలిస్టిక్ క్షిపణులు. శత్రువుల సైనిక స్థావరాలను, వైమానిక క్షేత్రాలను ఇవి క్షణాల్లో ధ్వంసం చేయగలవు. దశాబ్దాలుగా ఇరాన్ వీటిపై వేల కోట్లు ఖర్చు పెట్టింది. నేలమాళిగల్లో వీటిని దాచడం, రోడ్డుపై ఎక్కడికైనా తరలించగలిగే 'లాంచర్లు' ఉండటం వల్ల వీటిని గుర్తించడం శత్రువులకు కష్టంగా మారింది. ఇవే ఇనార్‌కు ప్రధానబలంగా మారాయి. దశాబ్దాలుగా వీటిని తయారు చేస్తున్నది. సింహభాగం పెట్టుబడులు వీటి తయారీపైనే పెట్టింది ఇరాన్.
క్రూయిజ్ క్షిపణులు & ఆత్మాహుతి డ్రోన్లు
ఏ దేశానికైనా క్రూయిజ్ క్షిపణులే బలం. అయితే, వీటిని మరింత స్మార్ట్‌గా తయారు చేసింది ఇరాన్. తక్కువ ఎత్తులో ప్రయాణం చేసేలా రూపొందించింది. ఫలితంగా రాడార్లు వీటిని సులభంగా పసిగట్టలేవు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధనౌకలను ఇవి నేరుగా లక్ష్యంగా చేసుకోగలవు. అమెరికా వీటిని అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన రక్షణ అస్త్రాలను వాడాల్సి వస్తోంది. వీటితో పాటుగా ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఇరాన్ విరివిగా వినియోగించింది. కేవలం 20వేల డాలర్ల విలువైన ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల విలువైన క్షిపణులను ప్రయోగించాల్సి వస్తోంది. తద్వారా అమెరికా, ఇజ్రాయిల్‌లు కోట్లాది డాలర్లు డబ్బు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
సముద్ర మందుపాతరలు
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లలో ఇరాన్ భారీగా మందుపాతరలను అమర్చింది. ఇవి సముద్ర గర్భంలో దాగి ఉండి, శత్రు నౌకలు రాగానే పేలిపోతాయి. వీటిని తొలగించడం అమెరికా నౌకాదళానికి పెద్ద సవాలుగా మారింది. దీనివల్ల అంతర్జాతీయ నౌకాయానం ప్రమాదంలో పడింది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా వాణిజ్యానికి తెరవాలి అంటే వీటిని తొలగించాలి. కానీ, తమ డిమాండ్లు అమలు కాకుండా ఇరాన్ వీటిని తొలగించదు. షరతులకు తలొగ్గకుంటే అమెరికా ఆంక్షలు ఎత్తివేయదు. రెండు దేశాలు పట్టువిడవకపోవడంతో ఈ జలసంధిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
స్వార్మ్ బోట్లు
ఈ బోట్లు చూసేందుకు చిన్నగా ఉంటాయి. కానీ, వేగంగా ప్రయాణం చేస్తూ శతృనౌకలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇలాంటి ఫాస్ట్ బోట్లు ఇరాన్ వద్ద వందలసంఖ్యలో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటిగా కాకుండా 'గుంపులుగా' భారీ యుద్ధనౌకలపై దాడి చేస్తాయి. వీటికి మెషిన్ గన్లు, రాకెట్లు ఉంటాయి. సముద్ర మందుపాతరల అండతో ఇవి అమెరికా నౌకలకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని అడ్డుకోవడం అమెరికాకు సవాలుగా మారింది.
గగనతల రక్షణ వ్యవస్థలు
అమెరికాకు చెందిన ఫైటర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి రాకుండా అడ్డుకునేందుకు బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగా బావర్ 373, ఖోరాద్ రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు ఇరాన్ తన సొంతంగా తయారు చేసుకున్నది. కాగా, రష్యా నుంచి ఎస్ 300 ను కొనుగోలు చేయడం ద్వారా శతృ విమానాలను 200 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి వాటిని పేల్చేస్తున్నది. గగనతలంలోకి ప్రవేశంచడానికి పూర్వమే వీటిని అడ్డుకోవడంతో ఇరాన్ సరిహద్దుల్లోకి వచ్చేందుకు అమెరికా జంకుతున్నది. అందుకే దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది.
అమెరికా వద్ద అపారమైన ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ... ఇరాన్ పరిమిత వనరులతో గెరిల్లా తరహా యుద్ధతంత్రాన్ని నడుపుతున్నది. ఈ ఐదు రకాలైన అస్త్రాల కారణంగా అమెరికా తన వ్యూహాలను పదేపదే మార్చుకోవాల్సి వస్తోంది. పశ్చిమాసియా రణరంగంలో ఇరాన్ ప్రదర్శిస్తున్న ఈ మొండి ధైర్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మొండిధైర్యం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.




