Iran War Threat : ఇరాన్‌పై మూడో ముప్పు?.. ట్రంప్ వ్యూహాలతో ప్రపంచవ్యాప్తంగా మొదలైన టెన్షన్

Iran War Threat : ఇరాన్‌పై మూడోసారి దాడికి ఇజ్రాయెల్, అమెరికాలు సిద్ధమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెరుగుతోంది.

CR Reddy
Published on: 2 July 2026 7:51 AM IST
Iran War Threat
X

Iran War Threat

Iran War Threat : ప్రపంచ దేశాలను మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మూడో రౌండ్ యుద్ధం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశంపై దాడులు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి అమెరికాతో జరిగిన ఒప్పందం వల్ల ఇరాన్‌లో కొంత శాంతి నెలకొన్నప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ ఆసియాలో మళ్లీ అగ్గి రాజేసాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే రెండుసార్లు ఇరాన్‌లోకి చొరబడి దాడులు చేసిందని, అవసరమైతే మూడోసారి కూడా దాడి చేయడానికి తాము వెనుకాడబోమని ఆయన బహిరంగంగా ప్రకటించారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్‌ను అణు ఆయుధాలు సాధించనివ్వనని నెతన్యాహు స్పష్టం చేశారు.

గతంలో జరిగిన రెండు దాడులు.. ఇరాన్ దీటైన హెచ్చరిక

ఇరాన్‌పై మొదటి దాడి గత ఏడాది జరిగింది. అప్పట్లో అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన మూడు ప్రధాన అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత రెండో రౌండ్ దాడి ఈ ఏడాది ఫిబ్రవరి 28 న జరిగింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ఎదురుదాడికి దిగడంతో ఈ యుద్ధం చాలా కాలం పాటు సాగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, ప్రధాని ఇద్దరూ కలిసి ఇరాన్‌ను నాశనం చేస్తామంటూ మూడోసారి హెచ్చరికలు జారీ చేయడంతో ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. తాము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ చర్చలు విఫలమైతే తాము కూడా యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ స్పష్టం చేశారు.

ట్రంప్ భారీ ఆపరేషన్ ప్లాన్.. రంగంలోకి దిగనున్న అమెరికా బాంబర్లు?

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ విషయంలో చాలా కఠినమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఒకవేళ ఇరాన్ గనుక కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తే, టెహ్రాన్‌పై మళ్లీ భారీ స్థాయిలో సైనిక చర్యలు చేపట్టేందుకు ట్రంప్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉందని అమెరికా ఉన్నతాధికారులు చెబుతున్నారు. ట్రంప్ ఇప్పటికే తన టాప్ మిలిటరీ కమాండర్లతో ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే అదే సమయంలో, ఇరాన్‌తో అణు అంశాలపై దౌత్యపరమైన చర్చలు కొనసాగించడానికి కూడా ఆయన అనుమతించారు.

యుద్ధానికి కారణమవుతున్న రెండు ప్రధాన వివాదాలు ఇవే

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం వివాదం అంతా రెండు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతోంది. అందులో మొదటిది ఇరాన్ అణు కార్యక్రమం కాగా, రెండోది అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి. ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగినప్పటికీ, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇంకా పూర్తిగా తెరవలేదు. అలాగే అమెరికా కోరుకున్నట్లుగా తన న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై ఇరాన్ ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. ఈ రెండు సమస్యలే ఇప్పుడు మళ్లీ యుద్ధాన్ని రేకెత్తించే ప్రధాన కారణాలుగా మారుతున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చమురు సంక్షోభం, మహా ద్రవ్యోల్బణం ఖాయం

ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై మూడోసారి దాడికి దిగితే, ఆ ప్రభావం కేవలం పశ్చిమ ఆసియా దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 72 డాలర్ల వద్ద ఉంది. కానీ యుద్ధం గనుక మొదలైతే ఈ ధర ఏకంగా 150 డాలర్ల పైమాటకు చేరుకుంటుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. చమురు ధరలు గనుక ఆ స్థాయిలో పెరిగితే ప్రపంచవ్యాప్తంగా రవాణా ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీనివల్ల ప్రతి ఒక్క దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story