US-Iran War: అమెరికాకు భారమవుతున్న ఇరాన్‌ యుద్ధం... నిధుల కోసం పెంటగాన్‌ ఎదురుచూపులు

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు ఏకంగా 37.5 బిలియన్‌ డాలర్ల నిధులను ఖర్చుచేసింది అమెరికా. ఈసారి పెంటగాన్‌ తన బడ్జెట్‌ను భారీగా పెంచడంతో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Balachander
Published on: 22 July 2026 7:49 AM IST
US-Iran War: అమెరికాకు భారమవుతున్న ఇరాన్‌ యుద్ధం... నిధుల కోసం పెంటగాన్‌ ఎదురుచూపులు
X

US-Iran War: పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు రగిలిపోతుండగా, ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారుతోంది. ఇప్పటివరకు ఈ యుద్ధం కోసం ఏకంగా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అగ్రరాజ్య రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ అమెరికన్ సెనెట్ కమిటీ ఎదుట వెల్లడించారు. మే నెలలో వేసిన అంచనాల కంటే ఇది ఏకంగా 8 బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం.

పెంటగాన్ నిధుల అభ్యర్థన ... రికార్డు స్థాయి బడ్జెట్

రక్షణ శాఖ అత్యవసర అవసరాల కోసం ఏకంగా 87 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్‌ను కోరగా, అందులో 67 బిలియన్ డాలర్లు కేవలం మధ్యప్రాచ్య సైనిక చర్యలకే వినియోగించనున్నారు. కాంగ్రెస్ తక్షణమే ఈ నిధులకు ఆమోదం తెలపకపోతే అమెరికా సైనికుల శిక్షణ కార్యక్రమాలను రద్దు చేయడంతో పాటు దళాల వేతనాలు, ఆయుధాల పునరుద్ధరణ నిలిచిపోతుందని రక్షణ కార్యదర్శి హెచ్చరించారు. ఇక, రాబోయే ఆర్థిక సంవత్సరానికి పెంటగాన్ మొత్తం బడ్జెట్ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఆధునిక అమెరికా చరిత్రలోనే అత్యధికం. ఇక ఇదిలా ఉంటే, సెనెట్ అప్రాప్రియేషన్స్ కమిటీ విచారణ తీవ్రమైన ఘర్షణ వాతావరణంలో సాగింది.గాజా, పాలస్తీనాతో పాటు ఇరాన్‌లో చిన్నారులపై బాంబులు వేయడం ఆపండి అంటూ నిరసనకారులు హాలులోనే నినాదాలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 18 మంది అమెరికన్ సైనికులు మరణించారని అధ్యక్షుడు వెల్లడించారు.

రెండు వర్గాలుగా మారిన అమెరికా రాజకీయం

వరుసగా 11 రోజులుగా అమెరికా ప్రతిదాడులు కొనసాగిస్తుండగా, ఇరాన్ కూడా గట్టి సవాలు విసురుతోంది. అమెరికాలో సాధారణ ప్రజలు నిత్యావసరాల ధరలతో అల్లాడుతుంటే, బాంబులు, క్షిపణుల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు యుద్ధానికి తగలేస్తున్నారని డెమొక్రాటిక్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ నిరవధిక వాయిదా పడనున్న తరుణంలో ఈ బడ్జెట్ ఆమోదం పొందుతుందా లేదా అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇరాన్‌పై అమెరికా రోజు రోజుకు దాడులు పెంచుతూనే ఉన్నా... ఇరాన్‌ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమను తాము రక్షించుకునేందుకు వీలైనంతగా ప్రతిఘటిస్తూనే ఉంది. మధ్యప్రాచ్యంలో అమెరికా దాని మిత్ర పక్షాల ఎయిర్‌బేస్‌లపై దాడులు చేస్తున్నది. ఇప్పటికే గల్ఫ్‌ దేశాల్లోని ఎయిర్‌బేస్‌లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం నిలిచిపోయినా... ఈ ఎయిర్‌బేస్‌లను తిరిగి పునరుద్దరించేందుకు భారీగా నిధులు ఖర్చుచేయవలసి వస్తుంది. ఇది అమెరికాకు అదనపు ఖర్చులే అని చెప్పాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story