War Update: యుద్ధ విరమణకు ఇరాన్ 10 షరతులు.. అమెరికా 15 కండిషన్లు.. ఒప్పందం కుదిరేనా?

Iran USA Peace Talks : ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ విరమణ చర్చలు మొదలయ్యాయి. ఇరాన్ 10 డిమాండ్లు, అమెరికా 15 షరతులు విధించాయి.

CR Reddy
Published on: 26 March 2026 7:11 AM IST
Iran USA Peace Talks
X

Iran USA Peace Talks

War Update: మిడిల్ ఈస్ట్‎లో గత 24 రోజులుగా సాగుతున్న భీకర యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం (మార్చి 23) చేసిన ప్రకటనతో శాంతి చర్చలపై ఆశలు చిగురించాయి. ఇరాన్‌తో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటించిన ట్రంప్, వారం రోజుల పాటు ఈ చర్చలు సాగుతాయని వెల్లడించారు. అయితే, ఈ సీజ్‌ఫైర్ (యుద్ధ విరమణ) ఒప్పందం అంత ఆషామాషీగా సాగేలా లేదు. ఇరాన్ తన పది కఠినమైన షరతులను అమెరికా ముందుంచగా, అమెరికా కూడా ఏమాత్రం తగ్గకుండా 15 షరతులతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ రెండు దేశాల మధ్య మైండ్ గేమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇరాన్ విధించిన 10 ప్రధాన షరతులు

ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికాను ఇరకాటంలో పెట్టేలా ఈ క్రింది డిమాండ్లను ఉంచింది.

1. భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ తమపై ఎప్పుడూ దాడి చేయబోవని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.

2. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా భారీగా హర్జాన్ (పరిహారం) చెల్లించాలి.

3. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఆదాయం వచ్చేలా కొత్త అంతర్జాతీయ నిబంధనలు రూపొందించాలి.

4. మధ్యప్రాచ్య దేశాలలో ఉన్న తన సైనిక స్థావరాలన్నింటినీ అమెరికా వెంటనే తొలగించాలి.

5. ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను పూర్తిగా రద్దు చేయాలి.

6. ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులపై అమెరికా విధించిన వ్యక్తిగత ఆంక్షలను ఎత్తివేయాలి.

7. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక చర్యలను వెంటనే నిలిపివేసి, లెబనాన్‌లో శాంతిని నెలకొల్పాలి.

8. మినాబ్‌లో జరిగిన చిన్నారుల హత్యలకు అమెరికా బాధ్యత వహించి, బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు పరిహారం చెల్లించాలి.

9. ఇరాన్ క్షిపణి తయారీపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు. ఒక స్వతంత్ర దేశంగా తమ రక్షణ వ్యవస్థను పెంచుకునే హక్కు ఉండాలి.

10. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరాన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించి, వీటో అధికారం ఇవ్వాలి.

అమెరికా విధించిన 15 కఠిన నిబంధనలు

ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేసి, ఆ దేశాన్ని దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ షరతులను సిద్ధం చేసింది.

1. చర్చలు సాఫీగా సాగాలంటే ఇరాన్ కనీసం ఒక నెల పాటు పూర్తిగా యుద్ధ విరమణ పాటించాలి.

2. ఇరాన్ తన అణు కార్యక్రమాలను దాదాపుగా పూర్తిగా మూసివేయాలి.

3. యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియను ఇరాన్ శాశ్వతంగా ఆపివేయాలి.

4. ఇరాన్ వద్ద ఉన్న అణు సామాగ్రిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కు అప్పగించాలి.

5. నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి కీలక అణు పరిశోధనా కేంద్రాలను పూర్తిగా నాశనం చేయాలి.

6. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఎప్పుడైనా తనిఖీలు చేయడానికి IAEA అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.

7. హమాస్ వంటి సాయుధ సంస్థలతో ఉన్న సంబంధాలను ఇరాన్ తెంచుకోవాలి.

8. పొరుగు దేశాల్లోని ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, నిధుల సరఫరాను పూర్తిగా ఆపాలి.

9. అంతర్జాతీయ నౌకల ప్రయాణం కోసం హోర్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచాలి.

10. క్షిపణుల సంఖ్య, అవి ప్రయాణించే దూరం (రేంజ్)పై కఠినమైన పరిమితులు విధించాలి.

11. ఇరాన్ సైనిక బలం కేవలం ఆత్మరక్షణకు సరిపడా మాత్రమే ఉండాలి.

12. పైన పేర్కొన్న షరతులన్నీ పాటిస్తేనే ఆర్థిక ఆంక్షల ఎత్తివేత గురించి అమెరికా ఆలోచిస్తుంది.

13. కేవలం విద్యుత్ తయారీ వంటి శాంతియుత అవసరాల కోసం అంతర్జాతీయ అణు సహాయం అందిస్తారు.

14. ఒకసారి ఆంక్షలు తొలగించిన తర్వాత, మళ్ళీ ఆకస్మికంగా ఆంక్షలు విధించే పద్ధతిని తీసివేస్తారు.

15. భవిష్యత్తులో ఎప్పుడూ అణు ఆయుధాలు తయారు చేయబోమని ఇరాన్ అధికారికంగా హామీ ఇవ్వాలి.

ఒప్పందం కుదిరితే లాభం ఎవరికి?

ఈ చర్చలు సఫలమైతే అది ట్రంప్ దౌత్య విజయం అవుతుంది. యుద్ధం వల్ల కలిగే ప్రపంచ ఆర్థిక నష్టాన్ని తగ్గించవచ్చు. అయితే, ఇరాన్ తన పట్టు వీడకుండా షరతులకు ఒప్పుకుంటే, అమెరికా తన పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు, ఇరాన్ గనుక అమెరికా అణు షరతులకు తలొగ్గితే అది ఆ దేశ భద్రతకు ముప్పుగా మారుతుంది. ప్రస్తుతం ఇరుపక్షాలు తమ పంతాలను పక్కన పెట్టి ఏ మేరకు సర్దుకుపోతాయనే దానిపైనే మధ్యప్రాచ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.

CR Reddy

CR Reddy

Next Story